peddapally | కోల్ సిటీ , ఏప్రిల్ 19 : ‘నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు… కానీ కేసీఆర్ అంటే ఏదో తెలియని అభిమానం… ఆయన స్పీచ్ వినడానికే మీటింగ్ కు వెళ్తా… అది ఎక్కడైనా ఉండనీ… తప్పకుండ పొద్దుగాలనే లేచి మీటింగ్ కు తప్పకుండ పోయేవాడిని..’ అంటూ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన మేడిపల్లి సత్యనారాయణ తన అనుభవంను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నాడు. ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 వసంతాలు అవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న రజతోత్సవ సభకు తాను సైతం.. అంటూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
సింగరేణిలో 2011లో రిటైర్డ్ అయిన సత్యనారాయణ ఈ వయసులో కూడా కేసీఆర్ మీటింగ్లకు యువకుడిలా ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాటల్లోనే… ‘నేను మొదట్నుంచి కేసీఆర్ కు వీరాభిమాని… అప్పట్ల సింగరేణిలో నౌకరి చేసేటప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న రోజులవి. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టిన.. నేను మాత్రం ఒకరోజు నాగ పోయినా పర్వాలేదు. అనుకొని డ్యూటీ కంటే మీటింగ్ కే ఎక్కువ విలువ ఇచ్చేవాడిని.. ఇంట్లో వాళ్లు కూడా డ్యూటీ పెట్టుకొని మీటింగ్ కు వెళ్తే ఏమొచ్చింది అనేటోళ్లు. ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతుంటే… మనం ఇంట్లో ఉంటే ఏం బాగుంటది అని సర్ది చెప్పేవాడిని. ఇక పొద్దుగాల లేచి నా సొంత ఖర్చులతో బస్సు ఎక్కేవాడిని.
ఒకవేళ మీటింగ్ ఏదైనా దూర ప్రాంతంలో ఉంటే రైలు కూడా ఎక్కి మీటింగ్ కు పోయి వచ్చిన రోజులున్నవి. ఎందుకో తెల్వదు గానీ.. కేసీఆర్ స్పీచ్ వినడానికైనా మీటింగ్ కు తప్పకుండా పోయేవాడిని. సింగరేణిలో రిటైర్డ్ అయినంక సుతం కేసీఆర్ మీటింగ్ ఉన్నది అంటే చాలు.. తప్పకుండా వెళ్లే వాడిని. ఇక గోదావరిఖనిలో మీటింగ్ అంటే పొద్దుగాలనే అక్కడ ఉండేవాణ్ణి. చాలా ముచ్చటేసేది ఆయన స్పీచ్ వింటుంటే. ఈనెల 27న వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు తాను సైతం స్వచ్ఛందంగా వెళ్తా’ అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలంటే తన మాటగా పిలుపునిస్తున్నాడు.