Vemulawada | వేములవాడ, జూలై 30 : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజుల పాటు నిర్వహించనున్న వరుణయాగం గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ గరీమ అగర్వాల్, ఎస్పీ మహేశ్ బిగితే హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన అతిధులకు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆలయ అర్చకులు, వేద పండితులకు వరుణ యాగం ప్రారంభం సందర్భంగా వర్ని సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. అలాగే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జూలై 30వ తేదీ నుండి ఆగస్టు 1 వరకు సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నారు. మొదటి రోజు కార్యక్రమాల్లో స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, వరుణయాగ హోమం, సంతత ధారాభిషేకం, జపానుష్ఠానాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు యాగశాలలో వరుణయాగాన్ని అధికారికంగా ప్రారంభించారు. భీమేశ్వర సదన్‌లోని ఈశాన్య మూలలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం భీమేశ్వర సదన్‌లో ఏర్పాటు చేసిన వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ శాలువాలతో మంత్రులను సత్కరించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వరుణయాగం అనేది కేవలం ఆధ్యాత్మిక క్రతువే కాకుండా లోకకళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించే మహోన్నత వైదిక సంప్రదాయమని పేర్కొన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడం ద్వారా చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని, రైతులకు సాగునీరు సమృద్ధిగా లభించి పంటలు బాగా పండుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవి, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధు తదితరులు ఉన్నారు.