బాలికలని కూడా చూడకుండా ఓ పీఈటీ వారిపై దాష్టీకం చూపించింది. స్నానాలు ఆలస్యంగా చేస్తున్నారన్న కోపంతో బాత్రూం డోర్లు పగులగొట్టి.. తన సెల్ఫోన్లో వీడియో తీస్తూ చితకబాదింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు తెల్లవారుజామున నాలుగు గంటలకే రోడ్డెక్కడంతో అధికారయంత్రాంగం దిగివచ్చి సదరు పీఈటీని విధుల నుంచి తొలగించింది.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 12: తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ విద్యాలయం విద్యార్థినులు ఆలస్యంగా స్నానాలు చేస్తున్నారనే నెపంతో పీఈటీ జ్యోత్స్న గురువారం వేకువజామున 3 గంటల సమయంలో వారిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. అంతే కాకుండా.. బాత్రూంల డోర్లు పగులగొట్టి, స్నానపు గదుల్లోనే సెల్‌ఫోన్‌తో వీడియోలు తీస్తూ కర్రతో చితకబాదింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు తెల్లవారుజామున 4 గంటలకు కళాశాల నుంచి బయటకు వచ్చి బద్దెనపల్లిలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో స్థానికులు మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని విద్యార్థినులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ శాంతించకుండా పీఈటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఈటీని సస్పెండ్ చేయాలని, ఎక్కడా పనిచేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. తర్వాత కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను చెప్పుకుందామని బయలుదేరగా, తంగళ్లపల్లి పోలీసులు అడ్డుకుని శాంతింపజేశారు. ఎంఈవో రఘుపతి చేరుకుని విద్యార్థినిలతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే డీఈవో రమేశ్‌కుమార్‌కు ఫోన్లో సమస్యను వివరించగా, సంబంధిత పీఈటీ జ్యోత్స్నను రిమూవ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారని డీఈవో తెలిపారు. ఈ విషయం చెప్పడంతో విద్యార్థినులు శాంతించి, పీఈటీ రావాలని, ఇక్కడ రిమూవ్ చేసినట్టు పత్రాలు ఇవ్వాలని పట్టుబట్టారు. ఆ పత్రాలను కళాశాలకు పంపిస్తామని నచ్చజెప్పి విద్యార్థినులను ఆటోల్లో కళాశాలకు తరలించారు. అనంతరం వారు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఎంఈవో రఘుపతి చేరుకుని, పీఈటీ జ్యోత్స్నను రిమూవ్ చేశామని, విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని హమీనిచ్చారు. దీంతో సుమారు ఐదు గంటల పాటు ఆందోళన చేసి విరమించి, కళాశాలకు వెళ్లారు.
ఇందిరమ్మకాలనీలోని గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝూ మధ్యాహ్నం సందర్శించారు. పాఠశాలలో సిబ్బంది, విద్యార్థినిలతో మాట్లాడారు. పీఈటీని తొలగించినట్టు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్, ప్రిన్సిపాల్‌కు ఆదేశించారు. కాగా, విద్యార్థుల డిమాండ్ మేరకు పీఈటీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని కలెక్టర్ సూచించడంతో పోలీసులు ప్రిన్సిపాల్ ద్వారా పీఈటీ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పంపించారు. ఆయన వెంట ప్రత్యేక అధికారి డీసీవో రామకృష్ణ, ప్రిన్సిపాల్ శకుంతల తదితరులు ఉన్నారు. అంతకు ముందు డీఈవో రమేశ్ పాఠశాలను సందర్శించారు.