Sunke Ravi Shankar | గంగాధర, ఆగస్టు 20 : రాష్ట్రంలోని గురుకులాల పాఠశాలలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ మసకబారుతున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం బీసీ గురుకుల పాఠశాలను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో నిర్వహణ, పర్యవేక్షణ లోపం తోనే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఆహారం కలుషితమైన విద్యార్థులు మరణించిన, స్వస్థతకు గురైన సంఘటనను గుర్తు చేశారు. పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడ అనుసరిస్తూ, తమ పంథాలోనే వెళ్తున్నదని దుయ్యబట్టారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, గురుకులాల్లోని ఉపాధ్యాయులు స్థానికంగా ఉండటం లేదన్నారు. గురుకుల పాఠశాలలను పర్యవేక్షించడానికి విద్యాశాఖకు సంబంధించి పర్యవేక్షణాధికారులు అందుబాటులో లేకపోవడం శోచనీయం అని అన్నారు. గత సంవత్సరం క్రితం ఇదే పాఠశాల ను సందర్శించి నప్పుడు కరెంట్ వైర్లు తెగిపడి విద్యార్థులు గాయపడ్డారని గుర్తు చేశారు.
అధికారులతో మాట్లాడితే వారం రోజుల్లొ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి, ఏడాది గడిచినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతులు సరిగా లేకపోవడంతో పాఠశాలల్లో విద్యార్థులు ప్రవైట్ పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని, ప్రభుత్వం ఇకనైనా గురుకులాల, సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నాయకులు సాగి మహిపాల్ రావు, మడ్లపల్లి గంగాధర్, వేముల దామోదర్, శ్రీ మల్ల మేఘరాజు, పంజాల ఆంజనేయులు, మామిడిపల్లి అఖిల్, నిమ్మనవేని ప్రభాకర్ తదితరులు ఉన్నారు.