MLA Padi Kaushik Reddy | వీణవంక, సెప్టెంబర్ 28 : కేసీఆర్ హయాంలోనే చేనేత కార్మికుల క్షేమం జరిగిందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. వీణవంక మండలంలోని కోర్కల్ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం సర్వసభ్య సమావేశం ఆ సంఘం చైర్మన్ అడిగొప్పుల సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు వారి సమస్యలు సభాముఖంగా తెలియపరచగా అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు అన్ని రకాలుగా ఆదుకున్నారని, యానాం సబ్సిడీతో ఎంతో మందికి మేలు జరిగిందని, ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం దొంగహామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, చివరికి బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ కూడా వేరే వారికి ఇచ్చి కార్మికుల పొట్ట కొడుతుందని అన్నారు.
ఈ నెల 30న సిరిసిల్లకు వస్తున్నానని రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా అమలయ్యేలా ప్రకటించి పోవాలని డిమాండ్ చేశారు. క్యాష్కట్ కూడా మాఫీ చేయాలని కోరారు. రోడ్లు బాగు చేయాలని, రైతులకు కరంట్ ఇవ్వాలని, రైతుబీమా ఇవ్వాలని, పెన్షన్లు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతుందని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానని, ఎవ్వరు కూడా అధైర్యపడొద్దని తెలిపారు. ఇటీవల వర్షాలు పడకపోతే రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేదని, కరంట్ కోతలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని, చెప్పిన ప్రతీ పనిని తప్పకుండా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో సమిండ్ల ప్రకాశ్ ఏర్పాటు చేసిన ఎస్ బిర్యాని, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేనేత సహాయ సంచాలకులు జీ రాఘవరావు, డెవలప్మెంట్ అధికారి అజహర్ వాహబ్, సంఘ సభ్యులు, వీణవంక సర్పంచ్ సరోజన, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.