Godavarikhani | కోల్ సిటీ, జూలై 11: రామగుండం నగర పాలక సంస్థకు చెందిన స్లాటర్ హౌస్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ భవనాలకు ఉన్న ఇనుప కిటికీలు. తలుపులు మాయం వెనుక మర్మమేమిటో అని చర్చ మొదలైంది. ఈ సంఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా.. బయటకు రాలేదు. అక్కడి ఘటనపై ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకవచ్చింది. ఆ ‘చోరీ.. అంతుచిక్కని మిస్టరీ’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనంతో డొంక కదులుతోంది. నగర పాలక సంస్థ అధికార వర్గాలను ఆందోళనకు గురి చేసింది.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం స్వయంగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంకు వచ్చి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై, నమస్తే కథనంపై ఆరా తీసినట్లు తెలిసింది. స్లాటర్ హౌస్ లో దొంగలు పడ్డ సంఘటనపై పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతులను తెప్పించుకొని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరుపై అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, స్లాటర్ హౌస్ లో దొంగల పాలైన సొత్తు విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయమై కాంట్రాక్టర్ల మధ్య కూడా తీవ్ర చర్చనీయాంశమైంది.
స్లాటర్ హౌస్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు పూర్తి బిల్లులు చెల్లించిన తర్వాతనే ఈ సంఘటన జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఐతే అక్కడ అన్ని సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ గోడలను పగలగొట్టి ఇనుప కిటికీలు, తలుపులను ఎత్తుకెళ్లడం ఒకటి రెండు రోజుల్లో అయ్యే పని కాదనీ, పక్కా పథకం ప్రకారమే జరిగి ఉంటుందని బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇది ఇంటి దొంగల పనా..? లేక బయటి దొంగల చేతివాటమా అన్నది చర్చనీయాంశమైంది.
సుమారు రూ.10 లక్షల విలువైన సామగ్రి మాయమైనా ఇప్పటివరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం అది అసాంఘీక కార్యకలాపాలకు నిలయంగా మారినట్లు చెప్పుకుంటున్నారు. త్వరితగతిన స్లాటర్ హౌస్ ను వినియోగంలోకి తీసుకవచ్చేందుకు చర్యలను వేగవంతం చేస్తుండగా, దొంగతనం సంఘటన ఏలాంటి మలుపు తిరుగుతుందోనని నగరంలో చర్చ జరుగుతోంది.