Henna | కోల్ సిటీ, జూలై 06: ఆషాఢ మాసం వస్తే చాలు.. మహిళలకు ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు. గౌరీ దేవి ప్రతిరూపంగా భావించే మైదాకుతో ఈ మాసంలో ఒక్కసారైనా చేతులను అలంకరించుకోవడం సాంప్రదాయం. సహజంగా పెరిగే మైదాకు చెట్ల ఆకులను తీసుకవచ్చి, రోట్లో వేసి మెత్తగా నూరి ఆ మిశ్రమంతో ఒకరికొకరు చేతులను అలంకరించుకోవడం శాస్త్రీయంగా వస్తున్న అనవాయితీ. దీనిలో భాగంగా గోదావరిఖనిలోని పలు ప్రాంతాల్లో మహిళలు ఒక వద్దకు చేరుకొని ఆషాఢ మాసం వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు.
స్థానిక గణేష్ నగర్‌కి చెందిన ఎర్రబెల్లి సుగుణ-లక్ష్మణరావు ఆధ్వర్యంలో ముందుగా వారాహి అమ్మవారి నవరాత్రి పూజ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం మహిళలకు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం డివిజన్ మహిళలతో కలిసి చేతులకు గోరింటాకు పెట్టుకొని ఆట పాటలతో ఆకట్టుకున్నారు. మహిళలు ఆషాఢమాసంలో మైదాకును చేతికి పెట్టుకుంటే మంచి ఆరోగ్యం, సౌభాగ్యం వస్తుందని సుగుణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు సుగుణ, ఉషశ్రీ, మౌనిక, స్వర్ణ, హిమ, రాధిక, జమున, పద్మ, రాజేశ్వరితోపాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తెలుగు సాంప్రదాయాన్ని చాటిచెప్పారు.