పెద్దపల్లి, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): ఖాన్సాయిపేట.. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి దగ్గరలోనే ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు మంథనికి రావాలంటే పిరిట్లవాగు వాగు దాటాల్సిందే. ఏటా వానకాలంలో ఖాన్సాయిపేట-మంథని రోడ్డుపై వాగు పారి రాకపోకలు నిలిచిపోయేవి. ప్రధాన రహదారిపై ఎప్పుడో ఏండ్ల కింద నిర్మించిన చిన్నపాటి రోడ్యాం దశాబ్దాల క్రితం శిథిలం కాగా, అప్పటి కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. దీంతో చిన్నపాటి వాన పడినా ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. ఇక రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఎస్సీకాలనీ పిల్లలు ఖాన్సాయిపేటలోని ప్రభుత్వ బడికి రావాలంటే వాగు దాటాల్సిందే.
వానకాలం వస్తే చాలు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చేది. కొన్నిసార్లు పిల్లలు ఉదయం స్కూల్ వెళ్లిన తర్వాత వర్షం కురిసి వాగు పొంగడంతో ఇండ్లకు రాలేక స్కూల్లోనే ఉండాల్సిన దుస్థితి ఉండేది. దశాబ్దాల ఈ సమస్యకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు పరిష్కారం చూపింది. 2014లో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రత్యేక చొరవతో 2017లో 2.50కోట్లు మంజూరు కాగా, వంతెన నిర్మాణమైంది. దీంతో ఆ రెండు గ్రామాల దశాబ్దాల నాటి దారిద్య్రం దూరమైంది. మెరుగైన రవాణా వ్యవస్థతోనే అభివృద్ధి సాధ్యమని భావిస్తున్న రాష్ట్ర సర్కారు, మంథని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనల నిర్మాణం చేపట్టింది. కోట్లాది రూపాయలతో అద్దాల్లాంటి రోడ్లను వేయించింది.

ఊరికిపోయి అటే చిక్కిన
మేం ఎవుసం చేసుకొని బతుకుతం. 2015ల మిర్చి సాగుకు అప్పు కోసమని వరంగల్ పోయిన. అక్కడ ఒకరి వద్ద 5వేలు అప్పు తీసుకున్న. ఆ పైసలు పట్టుకొని తిరిగి సాయంత్రం వచ్చిన. కానీ, అప్పటికే వానచ్చి పిరిట్లవాగు మస్తు పారుతున్నది. అయినా సరే అని చెట్టూ.. పుట్టా.. పట్టుకొని దాటేందుకు దిగిన. కానీ, వరద బాగుండె. బతికి బయటపడుతె సాలనుకొని ధైర్నంగనే ముందటికి నడిసిన. బొందిగలదాక లోతచ్చింది. మెల్లమెల్లగ దాటిన. అవతలి ఒడ్డుకు దాటే వరకు నేను అప్పుతెచ్చిన పైసలు నీళ్లళ్ల కొట్టుకపోతన్నై. కండ్ల ముందటే పైసలు నీళ్ల మీద పోతన్నై. వాటిని చూస్తే పానం పోయేటట్టున్నదని ఒడ్డుదాటి బయటపడ్డ. ఆ వాన పుణ్యమేమో గానీ ఇగ పంటెయ్యలె. ఆ ఏడాదంతా ఇంటికి చానా కష్టమైంది. ఈ బ్రిడ్జితోటి మా ఊరి బాధలన్నీ పోయినయ్.
– కుడుదుల సత్యనారాయణ, ఖాన్సాయిపేట
పావని పసిద్దికి చానా కష్టమైంది
ఏడేండ్ల కిందట ఒకసారి పిరిట్లవాగు పొంగుతంది. అదే టైంల మా ఇంటి దగ్గర పావనికి పురిటి నొప్పులు వచ్చినయ్. పాపం చానా బాధపడ్డది. వాగుదాటాలె మంథని దవాఖానకు తీసుకపోవాలె. తెల్లారేదాకా ఆగి తీసుకపోయినం. నొప్పులు బాగైతే పానమే పోయేది. అదృష్టం కొద్ది ఏంకాలె. ఇట్లాంటి కష్టాలు చానా ఉండేవి. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేగా మధన్న ఈ బ్రిడ్జి కట్టిచ్చినంక ఖానాపూర్ కష్టాలు తీరినయ్. చిన్న వానత్తె బడి బందయ్యేది. పంతుళ్లు వచ్చేటట్టు లేకుండె. ఎస్సీ కాలనీ పిల్లలు ఇటు వచ్చేటట్టు లేకుండె. బడి నడుసుడే కష్టమయ్యేది. బ్రిడ్జి లేకముందు అర్వకష్టాలుండేది. ఆ కష్టాలన్నీ తీరినయ్.
– మావురపు మల్లారెడ్డి, ఖాన్సాయిపేట