Prithviraj Sukumaran | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్షన్ కోరుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి షాట్, ప్రతి సన్నివేశాన్ని అత్యంత కచ్చితత్వంతో తెరకెక్కించే ఆయనను అభిమానులు ప్రేమగా ‘జక్కన్న’ అని పిలుస్తుంటారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా కోసం రాజమౌళి మరింత కష్టపడుతున్నారని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న వారణాసి భారీ అడ్వెంచర్ చిత్రంలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజమౌళి వర్కింగ్ స్టైల్, సెట్స్‌లో ఆయన అంకితభావం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. సెట్స్‌లో రాజమౌళిలా కష్టపడే దర్శకుడిని ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉంటే, ఆయన ఉదయం 5 గంటలకే సెట్స్‌కు చేరుకుంటారని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి ముందుగానే పలుమార్లు రిహార్సల్స్ చేసి, కెమెరా సెటప్‌లన్నీ సిద్ధం చేస్తారని వెల్లడించారు. మేము సెట్స్‌కు వచ్చేలోపే రాజమౌళి కనీసం 10 నుంచి 12 సార్లు రిహార్సల్స్ పూర్తి చేస్తారు. లంచ్ బ్రేక్ కూడా చాలా తక్కువ సమయం మాత్రమే తీసుకుంటారు. షాట్ రెడీ అంటే భోజనం మధ్యలో వదిలేసి కూడా సెట్స్‌కు వెళ్తారు అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘వారణాసి’లో ఒకే ఒక్క సన్నివేశం కోసం తాను, మహేష్ బాబు కలిసి 90కి పైగా టేకులు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఆ సన్నివేశం కోసం 94 లేదా 97 టేకులు తీసి ఉండొచ్చని చెప్పారు.
ఉదయం ప్రారంభమైన ఆ సీన్ షూటింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. మధ్యలో లంచ్ బ్రేక్ వచ్చినా షాట్ ఓకే కాలేదు. చివరికి ప్యాకప్ చెప్పి, మరుసటి రోజు అదే సీన్‌ను మళ్లీ షూట్ చేశాం అని ఆయన వివరించారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌గా పేరున్న మహేష్ బాబు కూడా ఒకే సన్నివేశం కోసం ఇన్ని టేకులు తీసుకోవడం ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఆ సీన్ ఏమిటనే విషయాన్ని పృథ్వీరాజ్ వెల్లడించలేదు. రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఆయన కేవలం గొప్ప దర్శకుడే కాదని, అద్భుతమైన నటుడు కూడా అని పృథ్వీరాజ్ ప్రశంసించారు. ఏ సన్నివేశాన్ని వివరించినా స్వయంగా ఆ పాత్రలోకి వెళ్లి ఎమోషన్స్, హావభావాలను ప్రదర్శిస్తారని తెలిపారు. దీనివల్ల నటీనటులకు పాత్రను అర్థం చేసుకోవడం చాలా సులభమవుతుందని చెప్పారు. మోహన్‌లాల్ తర్వాత తాను చూసిన అత్యుత్తమ నటుడు-దర్శకుడు రాజమౌళి అని కొనియాడిన పృథ్వీరాజ్, ఆయనతో పనిచేయడం తన జీవితంలో ఒక గొప్ప అనుభవమని చెప్పారు.