సిరిసిల్ల అప్పారెల్ పార్క్‌లో రెడీమెడ్ దుస్తుల తయారీకి మరో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ఇప్పటికే షెడ్ల నిర్మాణం పూర్తి కాగా, వచ్చే నెలలో రెడీమెడ్ దుస్తుల ఉత్పత్తులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. అలాగే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సంస్థలో దాదాపు 2వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నందున నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత జౌళీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కేటీఆర్, సిరిసిల్ల ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో 88ఎకరాల్లో 177కోట్లతో పెద్దూరు శివారులో అప్పారెల్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా రెడీమెడ్ దుస్తుల తయారీకి జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి రప్పించేందుకు కృషి చేశారు.
ఆయన కృషి ఫలితంగా గోకుల్దాస్ ఇమేజ్ కంపెనీ గ్రీన్ నిడిల్ యూనిట్ దాదాపు వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించింది. అలాగే మరో అంతర్జాతీయ సంస్థ టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ సిరిసిల్లలో ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చింది. 2022లో ఆ సంస్థ ఎండీ గోయెంక అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అప్పారెల్ పార్క్‌లోని ఏడెకరాల స్థలంలో షెడ్ల నిర్మాణాలు చేపట్టింది. ఏడాది కాలంలో పూర్తి చేసిన సంస్థ, దుస్తుల తయారీకి సన్నాహాలు చేస్తున్నది.
ఇప్పటికే అధునాతన జూకీ మిషన్లు సిరిసిల్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం 2వేల మంది యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో వచ్చే నెలలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కంపెనీకి కావాల్సిన సిబ్బంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సూపర్వైజర్లను నియమించింది.
కాగా గత ప్రభుత్వం టెక్స్టైల్స్ పార్కులో ఏర్పాటు చేసిన దుస్తుల తయారీలో నైపుణ్య శిక్షణ పొందిన వారు సైతం ఈ కంపెనీలో చేరేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. తొలి విడుతలో 800మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగం కల్పించనున్నట్లు సంస్థకు చెందిన ఉద్యోగులు తెలిపారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్థ సిరిసిల్లలో ప్రారంభమైతే నిరుద్యోగులకు వరంగా మారనున్నది. నెలకు 10వేలకు పైగా వేతనాలు పొందే అవకాశం ఉన్నది.
జిల్లా యువతకు ప్రాధాన్యం
త్వరలో ప్రారంభంకానున్న టెక్స్‌పోర్టు ఇండస్ట్రీస్ కంపెనీలో జిల్లా యువతకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఉపాధి పొందేందుకు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి దరఖాస్తులు చేసుకుంటున్నారు. దసరా పండుగ వరకు ఉత్పత్తులు ప్రారంభించేలా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని సంస్థలను సిరిసిల్లకు రప్పించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిసింది.