Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్, జూలై 23 : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు చదవడం, రాయడం నేర్పించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ సేవలు నాణ్యతప్రమాణాలు, జవాబుదారీతనం పెంపుపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి, రాగినేడు, బొంపల్లి గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు అందేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
అంగన్వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సకాలంలో అందించాలని సూచించారు. పీహెచ్సీలలో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచాలని, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. భూముల రీ-సర్వేను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు రెవెన్యూ శాఖ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాగినేడు పిహెచ్ సీ డాక్టర్ శ్రావణ్ కుమార్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్ లు , హెచ్ ఎంలు, అంగన్ వాడీ టీచర్ లు, డాక్టర్ ల బృందం పాల్గొన్నారు.