
Koppula Eshwar | ధర్మారం, ఆగస్టు 2 : సాగునీటి ప్రాజెక్టులపై ఎలాంటి అవగాహన లేకుండా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై వారికి ఎలాంటి పరిజ్ఞానం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ కట్టడాల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంపు హౌస్ డెలివరీ సిస్టర్న్ లను రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఆదివారం పరిశీలించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంపు హౌస్ డెలివరీ సిస్టర్న్ ల వద్ద గోదావరి జలాలపై పూలు జల్లి వందనం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మాజీ మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా ఇతర మంత్రులకు ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు సాగునీటికి శాశ్వతంగా ఇబ్బందులు లేకుండా ఉండాలని సంకల్పంతో తొలి సీఎం కేసీఆర్ మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించగా దానిపై రాష్ట్ర మంత్రులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన పెట్టారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు కు పంపిణీ చేస్తున్న గోదావరి జలాల గురించి మంత్రులు గాలి మాటలు మాట్లాడి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఈశ్వర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగమే ఎల్లంపల్లి ప్రాజెక్టు అనే విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియకపోవడం వారి అవివేకానికి నిదర్శనం అని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్ దేనని ఆయన కొనియాడారు. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని ఉద్దేశం రాష్ట్ర మంత్రులకే ఉంటే మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తుమ్మడిహెట్టి వద్ద 240 టీఎంసీలను గోదావరి జలాలను మళ్లించాలని ప్రాజెక్టు నిర్మాణానికి ఎందుకు పూనుకున్నారనే దానిపై వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎత్తిపోతలు లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరు వరకు గ్రావిటీ ద్వారా గోదావరి జలాలు తరలిపోతున్నాయని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అవగాహన లేకుండా మాట్లాడాలని ఆయన వ్యాఖ్యలను మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ నిర్మాణం నంది పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేసి గోదావరి జలాలను ఎత్తిపోసి నంది రిజర్వాయర్ ద్వారా గాయత్రి పంప్ హౌస్ కు తరలించి అక్కడ పంపులను ఆన్ చేయడంతోనే జిలాలు ఎత్తిపోయబడి మిడ్ మానేరుకు తరలిపోతూనే అనే విషయం మంత్రి హోదాలో ఉన్న లక్ష్మణ్ కుమార్ కు అవగాహన లేకపోవడం సిగ్గుచేటని అని ఆయన విమర్శించారు.
మంత్రులకు సాంకేతిక పరిజ్ఞానం లేదు.. : కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనుబంధ రిజర్వాయర్ నిర్మాణాల గురించి రాష్ట్ర మంత్రులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేదని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి నీటిపారుదల శాఖ ఉత్తంకుమార్ రెడ్డికి ఏబీసీడీలు కూడా తెలియవని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మంత్రులు కాళేశ్వరం లో కట్టిన ప్రాజెక్టును అక్కడ ఒక గుడి కట్టినట్లుగా అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనుబంధ నిర్మాణాలను ఏడాదిన్నర క్రితమే మరమ్మతులు చేయాలని ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎన్డీఎస్ సమావేశంలో అధికారులు ఛీవాట్లు పెట్టడంతో దిక్కుతోచలేని స్థితిలో ప్రాజెక్టుల గురించి అవగాహన రాహిత్యంగా మంత్రులు మాట్లాడుతున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లి నుంచి జలాలు మిడ్ మానేరు కు వెళ్తున్నాయని రాష్ట్ర మంత్రులు అనుకుంటే నంది పంప్ హౌస్ నుంచి 100 మీటర్ల ఎత్తు నుంచి డెలివరీ సిస్టర్న్ ల ద్వారా ఎగిసిపడి నంది రిజర్వాయర్ లోకి పంపిణీ చేస్తున్నారనే విషయం తెలియకపోవడం భారీ అవివేకానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కుట్రలతోనే కాలయాపన.. : మాజీ ఎమ్మెల్సీ ఎల్ రమణ
మాజీ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ సాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించగా దానిపై కాంగ్రెస్ మంత్రులు కుట్రలు కుతంత్రాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన అట్టి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కేసీఆర్ ను అప్రతిష్ట చేసే ప్రయత్నం చేయడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని ఎత్తిపోయాలన్నా ఉద్దేశంతోనే నంది హౌస్ లో పంపులు ఆన్ చేయించారని కానీ ప్రభుత్వానికి సాగునీటిని అందించాలనే ఉద్దేశం లేనేలేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, పెద్దపల్లి చొప్పదండి మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, సుంకే రవిశంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తులా ఉమ, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్మారంలో ఘన స్వాగతం పలికిన గులాబీ శ్రేణులు
కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని పర్యటనలో భాగంగా ధర్మారం మండలం నంది పంప్ హౌస్ డెలివరి సిస్టర్న్ ల సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ ప్రజా ప్రతినిధులకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కోటిలింగాలను దర్శించుకొని నంది మేడారం గ్రామానికి చేరుకోవడానికి మార్గం మధ్యలో ఉన్న ధర్మారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి కు ఈశ్వర్ తో పాటు నాయకులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. ధర్మారం నుంచి నంది మేడారంలోని నంది పంపు హౌస్ డెలివరి సిస్టర్న్ ల దాకా భారీ కార్లు, ద్విచక్ర వాహనాలతో పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్లారు. నాయకుల పర్యటనతో గులాబీ పార్టీలో కొత్త జోష్ వచ్చినట్లు కనిపించింది.