విద్యానగర్, మార్చి 30 : భారత మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర శాఖ 9వ వార్షిక పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్-2024 (నిరంతర వృత్తి నైపుణ్య) సదస్సును ఆదివారం కరీంనగర్లోని ప్రతిమ రేజెన్సీ హోటల్లో నిర్వహించనున్నట్లు కరీంనగర్ మానసిక వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ భాగ్యరెడ్డి, అధ్యక్షుడు డాక్టర్ కేకే లక్ష్మణ్, ఉపాధ్యక్షులు డాక్టర్ పీ కిషన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి ఎన్డీ సంజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ సాయికృష్ణ, కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ ఎల్ వార్షి తెలిపారు.
ఈ మేరకు వారు ప్రతిమ హోటల్ వద్ద మాట్లాడారు. మానసిక వైద్యవిభాగం -ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ, కరీంనగర్ మానసిక వైద్యుల సంఘం ఆధ్వర్యంలో జరిగే సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘మానసిక సమస్యలపై మానసిక వైద్యుల్లో పరిశోధనల సామర్థ్యం పెంపొందించడం’ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నామని, పరిశోధనలు ఎందుకు నిర్వర్తించాలి, పరిశోధనల ఆవశ్యకతలు, దేశంలో మానసిక సమస్యల స్థితిగతులు ఎలా తెలుసుకోవాలి, పరిశోధనలు సమాజానికి ఎలా తోడ్పడుతాయి, భవిష్యత్తులో సమాజంలో వచ్చే సమస్యలను ఎలా పసిగాట్టాలి? అనే అంశాలపై కూలంకశంగా శిక్షణ ఇస్తునట్లు చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో గల మానసిక వైద్య విద్యార్థులు సుమారు 250 మంది హాజరవుతున్నాని, దేశంలోని ప్రముఖ మానసిక వైద్య విభాగ ప్రొఫెసర్లు శిక్షణ ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యుల సంఘం బాధ్యులు, కార్యనిర్వాహక సభ్యులు డాక్టర్ కే పవన్, డాక్టర్ బీ పురుషోత్తం, డాక్టర్ ఆర్ శివకుమార్, డాక్టర్ జీ ప్రీతి, డాక్టర్ ఎల్ వర్షి, డాక్టర్ ఎం పృథ్విరెడ్డి, డాక్టర్ ఎన్ రవి కుమార్ పాల్గొన్నారు.