odavarikhani market | కోల్ సిటీ, అక్టోబర్ 1 : గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ ఓల్డ్ అశోక్ బజారులో గురువారం రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో భూసార పరీక్షలు చేయడంతో ఆందోళన మొదలైంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద సుమారు రూ.25 కోట్లతో ఆధునిక సమీకృత వాణిజ్య సముదాయాల భవన నిర్మాణంకు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించి ఇటీవల నగర పాలక కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఓల్డ్ అశోక్ ఏరియాలోని ఖాళీ స్థలంను కమర్షియల్ కాంప్లెక్స్ భవన నిర్మాణంకు ఎంపిక చేశారు. దీనిలో భాగంగా మట్టి నాణ్యత పరీక్షల చర్యలకు ఉపక్రమించారు. భూమి లోపలి వరకు హోల్ డ్రిలింగ్ చేసి మట్టిని సేకరించి హైదరాబాద్ లోని ల్యాబ్ కు తరలించారు.
ఈ పరిణామంతో అక్కడి మొబైల్, బట్టల షాపుల వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ప్రధాన చౌరస్తాలో కూల్చివేతల అనంతరం వాటి స్థానంలో కాంప్లెక్స్ ల నిర్మాణం పూర్తి కాలేదు. ఏడాది క్రితం లక్ష్మీనగర్ లోని మొబైల్ షాపులు, బట్టల షాపులను రోడ్ల అభివృద్ధి పేరిట కూల్చివేశారు. ఏడాది పాటు వ్యాపారులు జీవనోపాధి కోల్పోయి ఆర్థికంగా నష్టపోయారు. దీంతో ఓల్డ్ అశోక్ సెంటర్ లో తాత్కాలిక గదులు నిర్మించి వ్యాపారులకు అందజేశారు. ఇప్పుడిప్పుడే వ్యాపారాలు కొలిక్కి వస్తున్నాయనుకున్న లోపే మళ్లీ ఇదే స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగితే తామెక్కడికి వెళ్లేదంటూ వ్యాపారులు లబోదిబోమంటున్నారు .
వ్యాపారుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలనే రూ.కోట్ల టీయూఎఫ్ ఐ డీ సీ నిధులతో లక్ష్మీనగర్ లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు జరిగితే కొత్తగా నిర్మించిన లక్ష్మీనగర్ రోడ్లన్నీ మళ్లీ ధ్వంసమయ్యే పరిస్థితి లేకపోలేదు. ముందుచూపు లేని పనుల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భూసార పరీక్షల విషయమై నగర పాలక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ ను వివరణ కోరగా, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసమే మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపించినట్లు స్పష్టం చేశారు.