Gattubhutkur | గంగాధర, ఏప్రిల్ 13 : గంగాధర మండలం గట్టుభూత్కూర్ లో సీతారామచంద్రస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీతారామ సమేత లక్ష్మణుడు, స్వామి విగ్రహాలను ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఫల, పుష్ప, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం సీతారామ, లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గ్రామస్తులు సీతారాముల స్మరణ చేస్తూ రథాన్ని లాగుతూ ముందుకు సాగారు.
మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు. సీతారామచంద్రస్వామి రథోత్సవంతో గ్రామంలోని వీధులన్నీ భక్తి భావంతో నిండిపోయాయి. కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కంకణాల రాజగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రోమాల రమేష్,శాఖ జిల్లా మచ్చ శాఖ అధ్యక్షుడు గంగాధర కనుకయ్య, రెడ్డి సంఘం అధ్యక్షుడు కంకణాల మల్లారెడ్డి, కంకణాల సత్యనారాయణ రెడ్డి, మల్కాపురం రాజేశం గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.