కరీంనగర్ కమాన్‌చౌరస్తా, నవంబర్ 3 : కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గాయని సల్వాజి సంధ్య స్థానిక కలెక్టర్ ఆడిటోరియంలో ఆరు గంటల పాటు నిర్విరామంగా 72 పాటలు పాడి ఐదు రికార్డులు సొంతం చేసుకుంది. ఆదివారం ఉదయం సల్వాజి ప్రవీణ్ మ్యూజికల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రపంచ రికార్డు కోసం ప్రముఖ గాయని కేఎస్ చిత్ర పాడిన పాటలు పాడింది.
అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కే మహేశ్వర్, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ పొన్నం రవిచంద్ర, వరల్డ్ రికార్డ్ కోఆర్డినేటర్ కేవీ రమణారావు నేతృత్వంలో ఎనిమిది మంది వాయిద్య కళాకారుల సహకారంతో 72 పాటలు పాడింది. సాయంత్రం భారత్ వరల్డ్ రికార్డ్, సింగర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్, కల్చరల్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ప్రదర్శన రికార్డ్‌గా నమోదు చేసి, ఆమెను అభినందించారు. ఇక్కడ కేఎస్ అనంతాచారి, జీ కృపాదానం, వీ గోపాల్‌రావు, సల్వాజి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.