కరీంనగర్ కలెక్టరేట్/ గంగాధర, మార్చి 24: ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో మంగళవారం సర్వర్ డౌన్ అయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్ పడింది. స్లాట్ బుకింగ్‌లు, ఈసీలు, చలానాల చెల్లింపులాంటి సేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం స్లాట్ బుకింగ్ చేసుకొని తమకిచ్చిన సమయానికి రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వచ్చిన క్రయ విక్రయదారులు సర్వర్ సమస్యతో పడిగాపులు గాశారు. ఆన్లైన్ కాకపోవడంతో నిమిషాల్లో పూర్తయ్యే పనికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయంలో నిత్యం 40 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి.
మంగళవారం మధ్యాహ్నం వరకు ఒక్కటీ పూర్తి కాలేదు. తిమ్మాపూర్, గంగాధర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. సర్వర్ సతాయించడంపై సంబంధితాధికారులను ఆరా తీయగా, జిల్లాలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయంటూ సమాధానమిచ్చారు. అయితే రెండు దశాబ్దాల క్రితం ఓ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌నే వాడుతుండడం, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ల శాఖలో మార్పులు చేయకపోవడంతో తరచూ సర్వర్ సమస్య వస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ సామర్థ్యం పెంచి, బ్యాకప్ సర్వర్లు ఏర్పాటు చేస్తేనే అంతరాయాలకు పుల్‌స్టాప్ పడనున్నది. కాగా, మధ్యాహ్న తర్వాత సమస్య పరిష్కారడం కావడంతో రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరిగాయి.