ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 13: దుమాలలోని ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్ గురువారం అట్టహాసంగా ముగిసింది. ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలల అదనపు కార్యదర్శి సర్వేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అభినందనలు తెలిపారు. బహుమతి ముఖ్యం కాదని పోటీలో భాగస్వామ్యం కావడమే ముఖ్యమని సూచించారు. నవంబర్‌లో బెంగుళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు సైతం సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
దుమాల గురుకులంలో చేసిన ఏర్పాట్లు సైతం బాగున్నాయని మెచ్చుకున్నారు. అనంతరం విజేతలైన గ్రూప్, సోలో విభాగంలో విద్యార్థులకు జ్ఞాపికలను అందించారు. అంతకు ముందు ట్రైబల్ ఆర్ట్ గ్యాలరీ, ఉపాధ్యాయులు చేసిన చేతి వృత్తులు, చిత్రలేఖనం, బొమ్మల తయారీ, శిల్పం, విద్యార్థుల థీమ్ ఆర్ట్ గ్యాలరీని సందర్శించి వారు ప్రదర్శించిన నమూనా చిత్రాలు, శిల్పాలను చూసి మెచ్చుకున్నారు. రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం స్పాట్ పెయింటింగ్, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిచయం, గిరిజనుల సమస్యలపై థియేటర్, క్విజ్, స్పెల్‌బీ నిర్వహించారు. అలాగే ఉపాధ్యాయులకు సంగీత పోటీలు నిర్వహించారు. ఇక్కడ ఆర్సీవో డీఎస్ వెంకన్న, ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, ఎంపీడీవో చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.