కలెక్టరేట్, జనవరి 29 : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఎనిన్నకల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమనిబంధనలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని, బస్టాండ్, పబ్లిక్ పార్ వంటి ప్రాంతాల్లో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టికర్లు తొలగించాలని ఆదేశించారు.
ప్రజలను ప్రభావితం చేసేలా గోడలపై ఉన్న రాతలను చెరిపివేయాలని, దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలను కవర్ చేయాలన్నారు. బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నా మూసివేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.