పెద్దపల్లి, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఓ అధికారి నిర్లక్ష్యం అక్కడి ప్రజలకు శాపంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ కాలనీకే గ్రహణంలా మారింది.. తాతల కాలం నుంచి పట్టా భూముల్లో స్థిర నివాసం ఏర్పరచుకుని పిల్లల పెండ్లిండ్లు.. చదువుల కోసం ఖాళీ స్థలాలను కాపాడుకుంటూ వస్తున్న సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధిలోని గాంధీనగర్ ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.. గాంధీ నగర్ వాసుల కన్నీటి కష్టాలను గుర్తు చేస్తూ.. వారు 2007నుంచి పడుతున్న బాధలను కండ్లకు కట్టినట్లు గతేడాది జూలై నాలుగో తేదీన నమస్తే తెలంగాణ మినీలో ‘అమ్మరాదు.. కొనరాదు’ అంటూ ప్రత్యేక కథనం ప్రచురించింది.
ఆ పత్రిక ప్రతులు ఉన్నతాధికారులకు పంపడంతోపాటు ప్రజలు ప్రజావాణిలో సైతం దరఖాస్తులు పెట్టుకున్నారు. 2007లో నాటి తహశీల్ధార్ చేసిన తప్పిదంతో ఇక్కడి ఇండ్లు జాగాలన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. అత్యవసర సమయాల్లో తమ ఆస్తులు, పొలాలు, భూములు అమ్ముకోలేక, కొనుక్కోలేక 17 ఏండ్లుగా దాదాపు 280 కుటుంబాలు అరిగోస పడ్డాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని ‘నమస్తే తెలంగాణ’ విజ్ఞప్తి చేసింది. దీంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవ చూపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జరిగిన తప్పిదాన్ని ఉన్నతాధికారులతో చర్చించారు. గాంధీనగర్ వాసులకు అనుకూలంగా విధి విధానాలు రూపొందించారు. గాంధీనగర్ వాసులు తమ భూముల క్రయ విక్రయాలకు హక్కులను కల్పిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌లోని 10వ వార్డు సర్వే నెంబర్ 909లో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 909లో మొత్తం 15.19 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.13 ఎకరాల భూమి మాత్రమే రోడ్ల క్రింద ఉంది. మిగతా భూమి పట్టా భూమి అని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, సీసీఏ రికార్డులు కూడా వీటిని ధృవీకరిస్తున్నాయని కోయ శ్రీహర్ష తెలిపారు.
909/1, 909/2, 909/అ సర్వే నెంబర్ల క్రింద గల భూమి పట్టా భూమి అని ధృవీకరించామని కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయరాదని ఎక్కడా లేదన్నారు. పట్టా భూమికి రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రజల నుంచి పలు దరఖాస్తులు వచ్చాయని, దీనిపై ఐజీ, డీఐజీలను సంప్రదించగా రిజిస్ట్రేషన్ చేయవచ్చని తెలిపారని అన్నారు. 1.13 ఎకరాల 909వ సర్వే నంబర్ భూమి మాత్రం రిజిస్ట్రేషన్ చేయరాదని, 909/1, 909/2, 909/అ సర్వే నంబర్ల కింద గల భూమి రిజిస్ట్రేషన్లకు ఎటువంటి ఆటంకాలు లేవన్నారు.
‘మాది 17 ఏండ్ల గోస. ఒక్క అధికారి చేసిన తప్పిదానికి 150 ఇండ్లు, 280 కుటుంబాలకు కష్టాన్ని మిగిల్చింది. 2007నుంచి ఇక్కడి మా భూములను అమ్మరాదు కొనరాదని చెప్పారు. రిజిస్ట్రేషన్లు కాలేదు. దీంతో నమస్తే తెలంగాణను ఆశ్రయించాం. ఆ వార్తా కథనాలతో జిల్లా కలెక్టర్‌ను, ఉన్నతాధికారులను కలిశాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రత్యేక చొరవ చూపారు. ప్రత్యేకంగా కూలంకశంగా విషయాన్ని అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. మా బాధను ప్రత్యేక కథనంతో వెలికి తీసిన నమస్తే తెలంగాణకు, మా బాధను తీర్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని సుల్తానాబాద్ మున్సిపాలిటీ గాంధీనగర్ వాసి అనుమాల బాపూరావు పేర్కొన్నాడు.