Veenavanka | వీణవంక, సెప్టెంబర్ 11 : ఉత్తమ బోధనతో పాటు విద్యార్థిని తీర్చిదిద్దడానికి చేసే ప్రతీ పని ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు నిస్తుందని వీణవంక ఎంఈవో ఎస్ శోభారాణి అన్నారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంఈవో శోభారాణి ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంపికైన 20 మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను ఎంఈవో శోభారాణి శాలువాలతో సన్మానించి, మెమోంటోలు అందజేశారు. అనంతరం ఎంఈవో శోభారాణి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి మరింత కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్, కాంప్లెక్స్ హెచ్ఎంలు డీ సంపత్ కుమారచారి, ఎస్ శ్రీనివాస్, వీ చంద్రమౌళి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, డీటీఎఫ్ మండలాధ్యక్షుడు కే శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.