Chigurumamidi |చిగురుమామిడి, ఆగస్టు 28 : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి, పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకొని స్వీట్లు తినిపించారు. వివిధ ప్రాంతాల నుంచి గ్రామాలకు రాఖీలు కట్టేందుకు తరలిరావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ పేర్కొన్నారు. కుటుంబ విలువలు, పరస్పర గౌరవం, ఆప్యాయతలను పెంపొందించడంలో ఇటువంటి వేడుకలు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా హుస్నాబాద్‌కు చెందిన 18 వ వార్డు కౌన్సిలర్ వాల సుప్రజ-నవీన్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్‌కు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.