Peddapalli | పెద్దపల్లి రూరల్, జూన్ 15: పెద్దపల్లి జిల్లా కాసులపల్లి గ్రామంలో గడ్డిమందు పిచికారీ చేసిన మెషిన్‌తో ఆడుకుని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంటో కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసులపల్లికి చెందిన ఓ రైతు ఆదివారం తన వ్యవసాయ భూమిలో గడ్డిమందు పిచికారీ చేశాడు. అనంతరం స్ప్రేయర్ మెషిన్‌ను ఇంటికి తీసుకొచ్చి బయట ఉంచాడు. అయితే ఆ మెషిన్‌తో ముగ్గురు చిన్నారులు అకీరా నందన్ (7), కార్తికేష్ (6), రితిక్ (3) ఆడుకున్నారు. ఆ వెంటనే ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు.
ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు.. స్థానికుల సహకారంతో చిన్నారులను తొలుత పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.