ఓదెల, ఆగస్టు 5: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామంలో పాము కాటు మందును అందుబాటులో ఉంచుతున్నట్టు సర్పంచ్ బొంగాని రమ తెలిపారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయ పనులు, ఇండ్ల వద్ద పాముకాటులకు గురవుతున్న సందర్భాలు ఉంటున్నాయి. కొంత కాలం క్రితం ఇంటి వద్ద పాము కాటుకు గురై కాలేజీ విద్యార్థిని మృతి చెందింది.
దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులకు పాము కాటు నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ‘ఆంటీ స్నేక్’ మందును స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి రమేష్ వద్ద అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బుధవారం ఆంటీ స్నేక్ పాము కాటు మందులు ఆర్ఎంపీ డాక్టర్ కు సర్పంచ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జీలుక స్వప్న, పంచాయతీ కార్యదర్శి రాజకుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.