పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 22 : గ్రామాల్లో రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగిన గ్రామపంచాయతీ(Grama Panchayat)ల్లో కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారంతా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు బీఆర్ఎస్ సర్పంచ్‌లు, వార్డు సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు.
రాఘవాపూర్ సర్పంచ్ తాడిచెట్టి చామంతీ శ్రీకాంత్ దంపతులు స్థానిక మడేలయ్య, ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వివిద కులసంఘాలు, గ్రామస్తులు చామంతి శ్రీకాంత్ దంపతులను పూల మాలలు, శాలువాలు కప్పి సన్మానించారు.
పెద్దకల్వలలో సర్పంచ్ నర్ల కనుకమ్మ పోల్ రాజు యాదవ్ దంపతులు స్థానిక మల్లిఖార్జునస్వామి దేవాలయంలో, శివాలయంలో పూజలు చేసి ప్రమాణ స్వీకారమహోత్సవాన్ని పూర్తి చేశారు. నిట్టూరులో సర్పంచ్ ఆకుల సువర్ణ శ్రీనివాస్ దంపతులు స్థానిక దేవాలయంలో పూజల అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.
మూలసాలలో సర్పంచ్ జూపాక స్వేత వెంకటేష్, ఉపసర్పంచ్ కేశవేని అశోక్ యాదవ్‌లు మొదటగా బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేవాలయంలో పూజలు చేసి ప్రమాణస్వీకారం చేశారు. రాంపల్లి గ్రామపంచాయతీలో ఎన్నికలకు ముందే సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. డిసెంబర్ 17న ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా మంచిరోజులు లేవనే కారణంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేశారు.