ఆరో విడతకు ఉమ్మడి జిల్లాలో అంతారెడీ
పెద్దపల్లి, సిరిసిల్లలో కసరత్తు ముమ్మరం
రెండు జిల్లాల్లోని జలవనరుల్లో 2.78కోట్ల చేప విత్తనాలు పోయడమే లక్ష్యం
ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం
వచ్చే నెల మొదటి వారంలో విడిచేందుకు ఏర్పాట్లు
ఆనందంలో మత్స్యకారులు
పెద్దపల్లి/ రాజన్న సిరిసిల్ల, ఆగస్టు (నమస్తే తెలంగాణ): గతంలో మత్స్యకారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఉపాధి లేక వలసపోయే పరిస్థితి ఏర్పడింది. మత్స్యకారుల సంక్షేమానికి మత్స్య శాఖ ఉన్నా, అప్పటి సమైక్య ప్రభుత్వాలు అరకొరగా నిధులు కేటాయించేవి. వలల కోసమో, ఇ తరత్రా వ్యక్తిగత రుణాల కోసమో వెళ్లే మ త్స్యకారులకు నిరాశే ఎదురయ్యేది. సా మూహిక అవసరాల కోసం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు చేసుకునే దరఖాస్తులకు మోక్షం లభించేది కాదు. ఏళ్ల తరబడిగా పెండింగ్‌లోనే ఉండేవి. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య ఉన్న మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్ర భుత్వం వెలుగు నింపుతున్నది. ఆరేళ్లుగా భారీగా నిధులు కేటాయిస్తోంది. నీలి విప్ల వం పథకాన్ని తెచ్చి చేప విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. సమీకృత మ త్స్య అభివృద్ధి పథకం కింద వలలు, మో పెడ్లు, ఇతర వాహనాలు రాయితీపై అందిస్తుండడంతో మత్స్యకారుల దశ మారిం ది. రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో పుష్కలంగా మత్స్య సంపద పెరుగుతుండడంతో చేతినిండా ఉపాధి దొరుకుతున్నది. ఈ క్రమంలో ఆరో విడత నీలి విప్లవానికి రాష్ట్ర సర్కారు రంగం సిద్ధం చేసిం ది. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండుగా మారి న రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో చేప విత్తనాలు పోయాలని నిర్ణయించగా, ఉమ్మడి జిల్లా యంత్రాగం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2.78కోట్ల విత్తనాలు టార్గెట్‌గా పెట్టుకొని వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించింది.
పెద్దపల్లి జిల్లాలో 1.53కోట్ల విత్తనాలు
పెద్దపల్లి జిల్లాలోని జలవనరుల్లో చేప పిల్లల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. 2021-22 సంవత్సరానికిగాను ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని 188చెరువులు, పంచాయతీల పరిధిలోని 880చెరువులు, కుంటలు, సరస్వతీ, పార్వతీ బరాజ్‌లు, ఎల్లంపల్లి జలాశయాల్లో కోటి 53లక్షల 78వేల 918 చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సరస్వతీ, పార్వతీ బరాజ్, ఎల్లంపల్లి, నందిమేడారం రిజర్వాయర్లలో మొత్తం 38.50లక్షల చేప, 19లక్షల రొయ్య పిల్లలు వదలాలని నిర్ణయించారు. గోదావరికి దిగువన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అన్నారంలోని సరస్వతీ బరాజ్ బ్యాక్ వాటర్ ఏరియా అంతా పెద్దపల్లి జిల్లాలో విస్తరించి ఉండడంతో అందులో 8.79లక్షల చేప, 4లక్షల రొయ్య పిల్లలు, పార్వతీ బరాజ్‌లో 11.41లక్షల చేప, 4లక్షల రొయ్య పిల్లలు, ఎల్లంపల్లి బరాజ్‌లో 12.21లక్షల చేప, 4లక్షల రొయ్య పిల్లలు, ధర్మారం మండలం నంది మేడారం రిజర్వాయర్‌లో 6.09లక్షల చేప పిల్లలు వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక జిల్లాలోని 1072 చెరువులు, కుంటల్లో 1.15కోట్ల చేప విత్తనాలు పోయనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా రవ్వు, బొచ్చె, బంగారు తీగ, తదితర రకాలను వేయనున్నారు.
సిరిసిల్ల జిల్లాలో 1.25 కోట్ల పిల్లలు..
రాష్ట్ర సర్కారు ఐదేళ్లుగా జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులలో ఉచితంగా చేప పిల్లలు పోస్తూ మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. గతేడాది 390 చెరువుల్లో 1.16 కోట్ల పిల్లలను వదిలింది. ఈ సారి 402 చెరువులు, 2 ప్రాజెక్టులలో 1.25కోట్ల విత్తనాలు పోయాలని మత్స్య శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో రాజరాజేశ్వర (మధ్యమానేరు) ప్రాజెక్టులో 28.50 లక్షలు, ఎగువ మానేరు ప్రాజెక్టులో 10.50 లక్షల (82, 100 ఎంఎం సెంటీమీటర్ల పొడవు ఉన్న) విత్తనాలు పోయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన చెరువుల్లో (35,48 ఎంఎం సెంటీమీటర్ల పొడవు ఉన్న) చేపలను వదలనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 35శాతం కట్ల, 35శాతం రవ్వులు, 30 శాతం బంగారు తీగ చేపలు వేయనున్నారు. పెద్ద చెరువుల్లో 40శాతం బొచ్చెలు, 50శాతం రవ్వులు, 10శాతం మిగ్రాల చేపలు, రొయ్యలు వదలనున్నారు. ఈ నెలాఖరు నుంచి వచ్చేనెలలో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది.
విత్తన ఉత్పత్తి కేంద్రంగా ఎగువ మానేరు
ఇప్పటి వరకు విత్తన చేపలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తూ వచ్చేవారు. టెండర్ల పద్ధతిలో తీసుకునేవారు. అయితే చేప పిల్లలు నాసిరకం రావడం, పెరగకపోవడం వల్ల మత్స్యకారులు నష్టపోయేవారు. రాయలసీమ, ఆంధ్రా నుంచి దిగుబడి చేసుకుంటే ప్రభుత్వానికి గిట్టుబాటు కావడం లేదు. దీంతో చేపల పెంపకం ఇక్కడే చేపట్టాలని నిర్ణయించిన జిల్లా అధికార యంత్రాంగం, గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరులో చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఆరునెలల క్రితం ప్రారంభించింది.
వచ్చే నెల మొదట్లో పంపిణీ చేస్తాం..
జిల్లాలో మత్స్యశాఖ పరిధిలోని సరస్వతీ, పార్వతీ బరాజ్‌లు, ఎల్లంపల్లి, నందిమేడారం రిజర్వాయర్లతో పాటుగా 1068 చెరువులు, కుంటల్లో 1.53కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే నెల మొదట్లో పోసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. నాణ్యమైన చేప విత్తనాలను పంపిణీ చేసే విధంగా చూస్తున్నాం.
-ఎండీ ఇంతియాజ్ అహ్మద్‌ఖాన్, జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి, పెద్దపల్లి.