సీఎం కేసీఆర్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి
సాంఘిక సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
కోనరావుపేట మండలం మరిమడ్లలో పర్యటన
ఏకలవ్య స్కూల్లో అదనపు తరగతి గదులు, అభివృద్ధి పనులకు భూమిపూజ
చదువుపై పెట్టే ఖర్చు.. భవిష్యత్తుకు పెట్టుబడి: ఎమ్మెల్యే రమేశ్ బాబు
పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ
కోనరావుపేట, ఆగస్టు 27: నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్యనందించడమే సర్కారు ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఉద్ఘాటించారు. సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా గురుకులాలను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్లలో మంత్రి శుక్రవారం పర్యటించారు. ఏకలవ్య గిరిజన బాలుర పాఠశాలలో అదనపు తరగతి గదులు, రూ.5 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి భూమిపూజ చేశారు. అంతకుముందు స్కూల్‌కు చేరుకున్న మంత్రికి విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఒక్కో విద్యార్థికి రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యనందిస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. గిరిజన బిడ్డలకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఇంటిగ్రేటెడ్ కాలేజ్, సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశారన్నారు.
మంత్రి కేటీఆర్ కృషితో సిరిసిల్లలో ప్యాషన్ టెక్నాలజీ సంస్థ ఏర్పడిందన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇంజినీరింగ్ అధికారులు పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పాఠశాలకు వచ్చే దారిలో సీసీ రోడ్డు, ప్రహరీ నిర్మాణానికి రూ.70 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యపై పెట్టే ప్రతి రూపాయి విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడి అని పేర్కొన్నారు. మరిమడ్ల గిరిజన పాఠశాల కోనరావుపేట, రుద్రంగి, మానాలతో పాటు చుట్టూ పక్కల గిరిజన విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దుతుందన్నారు. స్కూల్లో సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గిరిజన బిడ్డకు విద్యే బ్రహ్మస్త్రంగా మారాలని అభివర్ణించారు. రాష్ట్రంలోని ఏకలవ్య పాఠశాలలు అకాడమిక్ ఫలితాల్లో మూడో స్థానం సాధించడం గర్వకారణమన్నారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, ఏకలవ్వ పాఠశాలల రీజినల్ కో ఆర్డినేటర్ డీసీ వెంకన్న, ప్రత్యేక కార్యదర్శి విజయలక్ష్మి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, ప్రిన్సిపాల్ వేము భాస్కర్‌రావు, సర్పంచ్ అశోక్, సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీటీసీ రేణుక, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, సెస్ మాజీ డైరెక్టర్ తిరుపతి ఉన్నారు.