ఎమ్మెల్యే కోరుకంటి చందర్
రూ.4.50 కోట్లతో సమీకృత రైతు బజారుకు శంకుస్థాపన
కోల్‌సిటీ, జూన్ 10: నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లను అభివృద్ధి చేసి రామగుండాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. రామగుండం నియోజకవర్గానికి గొప్ప భవిష్యత్ ఉందనీ, అది త్వరలోనే ఈ ప్రాంత ప్రజలు చూస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా నగర పాలక సంస్థ 46వ డివిజన్లో రూ4.50 కోట్ల నిధులతో సమీకృత రైతు బజారు సముదాయాల నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణాలను నగరాలుగా, పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దే గొప్ప ఆశయంతో సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారని, ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రజాభీష్టం మేరకే పరిపాలన సాగిస్తున్నానన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మెడికల్ కాలేజీ తీసుకొచ్చాననీ, ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమవుతాయన్నారు. త్వరలోనే రామగుండంలో ఐటీ టవర్, ఇండస్ట్రియల్ పార్కు పనులు కూడా మొదలవుతాయన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ డా.అనిల్‌కుమార్, కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కార్పొరేటర్ పాతపెల్లి లక్ష్మీ ఎల్లయ్య, బాల రాజ్‌కుమార్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాల్ రావు, జేవీ రాజు, మారుతి, మోహిద్ సన్ని తదితరులున్నారు.