KTR | రాజన్న సిరిసిల్ల, జూన్ 2( నమస్తే తెలంగాణ) : రాబోయేది మళ్లీ మన సర్కారే అని, మన సర్కార్ రాగానే రాష్ట వ్యాప్తంగా ప్రతీ సర్కార్ బడిని సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలా చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన మంగళవారం సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల గీత నగర్ ప్రభుత్వ పాఠశాల లో గిఫ్ట్ ఏ స్మెల్ కింద పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు ట్యాబ్ లు అందించి, అభినందించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 8 పాఠశాలను కార్పొరేట్ కు ధీటుగా మార్చుకున్నామని పేర్కొన్నారు. మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
గతం లో గిఫ్ట్ ఏ స్మెల్ కింద 6వేల మందికి ఐప్యాడ్ లు అందించినట్లు గుర్తుచేశారు. పదో తరగతి కాకుండా ఇంటర్, డిగ్రీ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల్ని ప్రోత్సాహకం అందిస్తామన్నారు. ఇదే కాకుండా ఐఐటీ, జేఈఈలో కూడా ప్రతిభ కనబరిచిన జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తామన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, పిల్లలు ఏదైనా సాధిస్తే తల్లిదండ్రుల ఆనందం వర్ణించలేమన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, బీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వైస్ చైర్మన్ దార్ల సందీప్, బొల్లి రామ్మోహన్, కౌన్సిలర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.