Dharmaram | ధర్మారం, ఆగస్టు 21 : నల్గొండ జిల్లాలోని కొండ మల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపా రెడ్డి విద్యార్థుల చేతిలో హత్యకు గురి కావడం బాధాకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశారు. రూపా రెడ్డి హత్యపట్ల పట్ల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. స్థానిక స్మార్ట్ కిడ్స్, కృష్ణవేణి, సాందీపని పాఠశాలలు, దొంగతుర్తి గ్రామంలోని మాస్టర్ మైండ్స్, చైతన్య స్కూల్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు ఉపాధ్యాయులు సంయుక్తంగా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని ప్రిన్సిపాల్ రూపా రెడ్డి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. వారు కొంతసేపు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు పాశవికంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. విద్యాబుద్ధులు నేర్పించి, క్రమశిక్షణతో ఉండాలని నిర్దేశించిన సదరు ప్రిన్సిపాల్ ను విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా హతమార్చడం దారుణమని వారు పేర్కొన్నారు. ఈ సంఘటన యావత్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్కే రక్షణ లేకుండా పోవడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎంతో దురదృష్టకరమని వారన్నారు.
ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని వారు సందర్భంగా పేర్కొన్నారు. ఇకముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సంఘటనకు పాల్పడిన విద్యార్థులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు, ఉపాధ్యాయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని వారు సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు బుదారపు మహేందర్, కిరణ్ కుమార్, పాములపర్తి శ్రీనివాస్, మందపల్లి లక్ష్మణ్, జక్కని ఆశిష్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.