Mango | మన మామిడికి జాతీయ ఖ్యాతి.. దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా డిమాండ్
మామిడి నోరూరిస్తున్నది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మన మధుర ఫలానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతున్నది. తనదైన రంగు, వాసన, రుచి, మంచి నాణ్యతతో ఉంటుండడంతో దేశం నలుమూలలకు తరలిపోతూ ‘మామిడి’ అంటే కరీంనగర్ అన్న బ్రాండ్‌ను సంపాదించుకున్నది.
- మంచి రుచి, నాణ్యతతో గుర్తింపు
- కరీంనగర్ నుంచే ఉత్తరాది రాష్ర్టాలకు ఎగుమతి
Mango | మామిడి నోరూరిస్తున్నది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మన మధుర ఫలానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతున్నది. తనదైన రంగు, వాసన, రుచి, మంచి నాణ్యతతో ఉంటుండడంతో దేశం నలుమూలలకు తరలిపోతూ ‘మామిడి’ అంటే కరీంనగర్ అన్న బ్రాండ్‌ను సంపాదించుకున్నది. ముఖ్యంగా ఉత్తరాది ఫిదా అయిపోతున్నది. జిల్లాలో 6,500 ఎకరాల తోటల నుంచి దిగుబడులు దండిగా వస్తుండగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పండ్ల మార్కెట్ కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగుతూ ఇతర రాష్ర్టాల వ్యాపారులకూ బతుకునిస్తున్నది. సీజన్ ప్రారంభంకాగానే తమ సిబ్బందితో ఇక్కడ వాలిపోతూ తమకు నచ్చిన కాయలు కొనుగోలు చేస్తూ ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, నేపాల్‌కు పంపిస్తూ సీజన్లో మంచి లాభాలు పొందుతున్నారు.
ముకరంపుర, మే 7 : మన మామిడి రుచికి ఉత్తరాది ఫిదా అయిపోతున్నది. దీంతో అక్కడి వ్యాపారులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పండ్ల మార్కెట్‌కు వరుస కడుతుండడంతో వ్యాపారం జోరుగా సాగుతున్నది. స్థానిక కమిషన్ ఏజెంట్ల నుంచి నిత్యం వందలాది టన్నుల మామిడి కాయలు కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా, మార్కెట్ కమిటీకి మంచి ఆదాయం సమకూరుతున్నది.
ఎందుకింత డిమాండ్ అంటే..?
కరీంనగర్ జిల్లాలో 6,500 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ప్రధానంగా మానకొండూర్, రామడుగు, గంగాధర, గన్నేరువరం, కొత్తపల్లి, చొప్పదండి, చిగురుమామిడి, కరీంనగర్ రూరల్‌తోపాటు పలు మండలాల్లో విస్తరించాయి. బంగెనపల్లి, దసేరి, తోతాపురి, హిమాయత్, అల్ఫాన్సో రకాలకు మంచి ఆదరణ ఉంది. జిల్లాలో నేల స్వభావంతోపాటు వాతావరణం మామిడి తోటల సాగుకు అనుకూలంగా ఉంది. అధిక శాతం తోటలు ఎర్రనేలల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా పూత నుంచి కాయలు పక్వానికి వచ్చే దశ వరకు అనువైన వాతావరణం, తగిన ఉష్ణోగ్రత వల్ల కాయ పరిమాణం, నాణ్యతతో పాటు రుచి పరంగా కూడా బాగుంటుందని ఉద్యాన అధికారులు పేర్కొంటున్నారు.
కరీంనగర్‌కు పలు రాష్ర్టాల వ్యాపారులు
కరీంనగర్ పండ్ల మార్కెట్‌కు జిల్లా రైతులతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని మండలాల రైతులు మామిడి కాయలు తీసుకువచ్చి విక్రయిస్తారు. స్థానిక మార్కెట్లో 16మంది కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. మామిడి సీజన్ ప్రారంభం కాగానే పలు రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు గ్రేడింగ్, ప్యాకింగ్ సిబ్బందితో సహా మార్కెట్‌కు వచ్చి సీజన్ పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటారు. ప్రతి రోజు జరిగే లైవ్ బిడ్డింగ్‌లో నిర్ణయించిన ధర మేరకు మామిడి కాయలు కొనుగోలు చేస్తారు. నాణ్యత, పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ అనంతరం ప్యాకింగ్ చేసి డిమాండ్ ఉన్న రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌తో పాటు నేపాల్‌కు కూడా కరీంనగర్ మామిడిని ఎగుమతి చేస్తున్నారు.
పండ్ల మార్కెట్లో కొనుగోళ్లు
సంవత్సరం కొనుగోళ్లు(మె.టన్నుల్లో)
2019 39,450
2020 33,940
2021 10,960
2022 48,990
2023 19,890(ఏప్రిల్ 26వరకు)
మార్కెట్ ఫీజు
సంవత్సరం మార్కెట్ఫీజు (రూ.లక్షల్లో)
2018-19 8,37,550
2019-20 7,00,131
2020-21 5,91,270
2021-22 13,93,210
2022-23 23,24,000
పండ్ల మార్కెట్లో సకల సౌకర్యాలు
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లోని పండ్ల మార్కెట్లో ఏటా కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పలు రాష్ర్టాల నుంచి మన మార్కెట్‌కు వ్యాపారులు వచ్చి, సీజన్ పూర్తయ్యే దాకా ఇక్కడే ఉంటున్నారు. స్థానికంగానే గ్రేడింగ్, ప్యాకింగ్ చేసుకుతుండగా, అదనపు షెడ్లు కూడా కేటాయించాం. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాం. నిరంతర విద్యుత్, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. కొనుగోళ్లలో పారదర్శకతతో పాటు నిరంతరం పర్యవేక్షించేలా యార్డు ఆవరణలో సీసీ కెమెరాలను బిగించాం.
– రెడ్డవేని మధు, ఏఎంసీ చైర్మన్ (కరీంనగర్)
కరీంనగర్ మామిడితో మంచి లాభం
కరీంనగర్ మామిడికి మా ఏరియాలో మంచి డిమాండ్ ఉంది. నేను నాలుగేళ్లుగా ఇక్కడికి వస్తున్నా. ఇక్కడి మార్కెట్లో మామిడి కాయలు కొని ఎగుమతి చేయడంతో మంచి లాభం వస్తోంది. సీజన్ ప్రారంభం నుంచి పూర్తయ్యేదాక కూలీలతో పాటు ఇక్కడే ఉంటాం. ఇప్పటి వరకు 8లారీల మామిడి కొనుగోలు చేసి పలు రాష్ర్టాలకు ఎగుమతి చేసిన.
– అయాన్షు, నాగపూర్
మంచి క్వాలిటీతోనే డిమాండ్
కరీంనగర్లో పండే మామిడి కాయలు మంచి క్వాలిటీగా ఉంటాయి. పెద్ద సైజుతో నాణ్యంగా ఉండడం ద్వారా ఉత్తరప్రదేశ్ మార్కెట్లో డిమాండ్ బాగా ఉంటుంది. అందువల్ల గత రెండేళ్లుగా కరీంనగర్ మార్కెట్లోనే కాయలు కొనుగోలు చేస్తున్నా. ఇప్పటి వరకు 13లారీల మామిడి కాయలు పలు రాష్ర్టాలకు పంపించిన.
– మనోజ్ సోన్కర్, జోన్పూర్(ఉత్తరప్రదేశ్)
ఎనిమిదేళ్లుగా వ్యాపారం చేస్తున్న
మాది మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. ఇక్కడి కాయలను మా మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ర్టాల్లోని ప్రజలు చాలా ఇష్టపడతారు. నేను ఎనిమిదేళ్లుగా కరీంనగర్లో మామిడి వ్యాపారం చేస్తున్నా. మంచి లాభం వస్తుంది. నెల రోజుల కిందే కూలీలతో కలిసి ఇక్కడి పండ్ల మార్కెట్‌కు వచ్చిన. సీజన్ మొదలైనప్పటి నుంచే కాయలు పంపించాలని చాలా రాష్ర్టాల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలకు పంపించిన.
– వినోద్, గ్వాలియర్(మధ్యప్రదేశ్)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

