కరీంనగర్ కార్పొరేషన్, డిసెంబర్ 13 : మ్యాన్ హోల్ క్లీనింగ్‌కు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధునిక రోబోటిక్ యంత్రాన్ని తీసుకొచ్చింది. దీని పనితీరును శుక్రవారం హౌసింగ్‌బోర్డుకాలనీలో ట్రయల్ రన్ చేయగా, నగర కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ యంత్రం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కరీంనగర్‌ను మాన్యువల్ సావెంజింగ్ రహిత నగరంగా మార్చవచ్చని తెలిపారు. ఇందులో ఉత్తమమైన ఫీచర్లు ఉన్నాయని, ప్రధాన భాగాల్లో ఆటోమేటిక్ కలెక్షన్, డ్రై వేస్ట్ డంబర్, జనరేటర్, కాంప్రెసర్ వంటి పరికరాలు ఉన్నాయని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్లో మూల మూలలకూ వెళ్లి శుభ్రపరిచే సామర్థ్యం ఈ యంత్రంలో ఉందన్నారు. ఇందులో రోబోటిక్ ఆర్మ్ రోబోటిక్ పాదాలు, గ్రాబింగ్ బకెట్, విషపూరిత వాయువు అన్వేషణ వ్యవస్థ వంటి అధునిక ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. రోబోట్ యంత్రం 360 డిగ్రీ పద్ధతిలో మాన్హోల్ చాంబర్‌ను శుభ్రపరిచి.. మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫైడ్ వంటి విషపూరిత వాయువులను శోషించుకొని కార్మికులను రక్షిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వేణు మాధవ్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు.