మల్యాల, జూలై 20 : సాగునీటి కోసం మల్యాల మండల రైతులు రోడ్డెక్కారు. కాళేశ్వరం జలాలతో వరదకాలువను నింపాలని డిమాండ్ చేస్తూ రణం సాగించారు. ఈ మేరకు సోమవారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సుమారు 300 మంది తరలివచ్చి.. మల్యాల ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నా చేశారు. అరగంటకుపైగా జగిత్యాల- కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలపై నినదించారు. ప్రాణహిత నదీ జలాలు వృథాగా పోతున్నా ఎందుకు ఎత్తిపోయడం లేదని నిలదీశారు.
మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి ఎత్తిపోసే అవకాశమున్నా సర్కారు పట్టించుకోవడం లేదని, వరద కాలువను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే నీటిని ఎత్తిపోసి వరదకాలువను నింపాలని, లేదంటే జగిత్యాల కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం పోతారం సహకార సంఘ అధ్యక్షుడు అయిల్నేని సాగర్‌రావు మాట్లాడుతూ, వరద కాలువపై ఆధారపడి ఒక్క మల్యాల మండలంలోనే వందలాది ఎకరాలు సాగు చేసుకున్నారని చెప్పారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి కేవలం 2 టీఎంసీలు వరదకాలువలో ఎత్తిపోస్తే 122 కిలోమీటర్ల మేర జీవనదిలా మారుతుందన్నారు. కాలువ వెంట భూగర్భజలాలు పెరుగుతాయని, వేలాది ఎకరాలకు సాగునీటి గోస తప్పుతుందని చెప్పారు. కానీ, కాంగ్రెస్ సర్కారు రైతులను అన్ని విధాలా గోస పెడుతున్నదని మండిపడ్డారు.
ప్రాణహిత జలాలు దిగువకు వృథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చూస్తుంటే రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. వ్యవసాయ విద్యుత్‌లో సైతం అప్రకటిత కోతలు విధిస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నదని దుయ్యబట్టారు. పంటలకు నీరందించాలని కోరితే రక్తం చల్లాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికావని, ఇప్పటికైనా వరదకాలువ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి రైతాంగానికి అండగా నిలవాలని కోరారు.
ధర్నాతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోగా.. వెంటనే మల్యాల సీఐ రాజ్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేసి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్ గడ్డమీది శ్రీనివాస్‌కు వినతిప్రతం అందజేశారు. వరద కాలువను నింపేలా చూడాలని కోరారు. ధర్నాలో మాజీ వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, సాగర్‌రావు, మల్లారెడ్డి, నేరెళ్ల భూమరెడ్డి, జనగం శ్రీనివాస్, మధుసుదన్‌రావు, భూపతిరెడ్డి, అనిల్‌రెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, మల్లయ్య, ఆకుల నగేశ్, భాస్కర్‌రెడ్డి, మల్లయ్య, సంజీవ్, వినయ్, తిరుపతిరెడ్డి, అజహరొద్దీన్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేతల నిర్బంధం.. జీవన్‌రెడ్డి అరెస్ట్
మల్యాల ఎక్స్‌రోడ్ వద్ద ధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. జగిత్యాల నుంచి వస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డిని రాజారాం శివారులో మల్యాల ఎస్ఐ సందీప్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాను ధర్నాకు వెళ్లనని, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌తో కలిసి రైతుల పక్షాన కొండగట్టులో ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు వెళ్తున్నానని తెలుపడంతో వదిలిపెట్టారు. అక్కడి నుంచి బయలుదేరిన జీవన్‌రెడ్డిని నూకపల్లి శివారులో పెగడపల్లి ఎస్ఐ కిరణ్‌కుమార్ అడ్డుకున్నారు.
ధర్నాకు వెళ్లడం లేదని, అవసరమైతే ఎస్ఐ తమ వాహనంలో రావాలని జీవన్‌రెడ్డి సూచించడంతో వదిలిపెట్టారు. అనంతరం జీవన్‌రెడ్డి నూకపల్లి శివారులోని వరదకాలువ వద్దకు చేరుకుని కాలువ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ వద్దకు వెళ్తున్న క్రమంలో సుంకెను కొడిమ్యాల ఎస్ఐ నరేశ్‌కుమార్ ముందస్తు అరెస్ట్ చేశారని, ప్రెస్‌మీట్ సైతం నిర్వహించకూడదని సూచించినట్లు సమాచారం రావడంతో జీవన్‌రెడ్డి ఆగ్రహించారు. రవిశంకర్‌ను నూకపల్లి వరదకాలువ వద్దకు తీసుకురావాలని రోడ్డుపై బైఠాయించారు. కాసేపటి తర్వాత మల్యాల సీఐ, పెగడపల్లి, మల్యాల ఎస్ఐలు.. జీవన్‌రెడ్డిని అరెస్ట్ చేసి మల్యాల ఠాణాకు బయలుదేరారు.
అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఠాణాకు వస్తున్నారనే సమాచారంతో జీవన్‌రెడ్డిని జగిత్యాలలోని ఇంటి వద్దకు తీసుకువెళ్లారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌ను సైతం కొడిమ్యాల మండలంలోని దొంగలమర్రి వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే బైఠాయించగా, అరెస్ట్ చేసి గంగాధర మండలంలోని బూరుగుపల్లి తన నివాసం వద్ద వదిలిపెట్టారు. ఈ విషయమై మల్యాల సీఐ రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా.. రైతుల ధర్నాకు రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా అనుమతి తీసుకున్నారని, తమకు జీవన్‌రెడ్డి, రవిశంకర్ రాకపై ముందస్తు సమాచారం లేకపోవడంతోనే వారిని మల్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసి, తమ వాహనాలలో వారి ఇంటి వద్ద వదిలిపెట్టామని చెప్పారు.
మా పోరాటం ఆగదు
మల్యాల, కొడిమ్యాల మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నయి. వరద కాలువకు నీళ్లు విడుదల చేయకుండా స్థానిక ఎమ్మెల్యే సత్యం, సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నరు. నీళ్లివ్వడం చేతకాని రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నేతలను పోలీస్స్టేషన్లకు తరలించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా రైతుల పక్షాన మా పోరాటం ఆగదు.
– దొంగలమర్రి వద్ద మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (కొడిమ్యాల)
మాట్లాడే హక్కు లేదా..?
ప్రజాస్వామ్యంలో మాకు మాట్లాడే హక్కు సైతం లేదా..? ధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపే హక్కు లేదా..? మేం ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు వెళ్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం సరికాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి పంపింగ్ చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే వరదకాలువకు ఈ దుస్థితి వచ్చింది. సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండాలంటే కన్నెపల్లి పంపులను ప్రారంభించాలి.
– నూకపల్లి వద్ద మాజీ మంత్రి జీవన్‌రెడ్డి