మంథని, ఫిబ్రవరి 11: ‘ఇతరులు చేసిన పనులను తనవిగా చెప్పుకోవడం తప్పా మంథనికి చేసిందేంలేదు. కాంగ్రెస్ హాయాంలో నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేంలేదు. ఇక్కడి ఎమ్మెల్యేకు ఓట్లపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు’ అం టూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధూకర్ ఫైర్ అయ్యారు. మంథని రాజగృహలో పుట్టలింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 20న పట్టణంలోని ఎస్ఎల్బీ గార్డెన్స్‌లో నిర్వహించనున్న జాబ్‌మేళా కరపత్రాలను మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఓట్లతో గెలిచిన ఇక్కడి ఎమ్మెల్యే వారికి చేసిందేంలేదని విమర్శించారు. పుట్ట లింగమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాము అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు పోటీగా ఎమ్మెల్యే ఇటీవల పోలీస్ అభ్యర్ధులకు శిక్షణ పేరిట హడావుడి చేశారని దుయ్యబట్టారు.
హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్ సంస్థ మంథనిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తే ఎమ్మె ల్యే తానే నిర్వహిస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ప్రస్తుతం గ్రూపు-1, 2 అభ్యర్ధులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారని, అయితే కోచింగ్ ఇచ్చేందుకు సబ్జెక్టు నిపుణుల ను అందుబాటులో ఉంచలేదని ఆరోపించారు. ఇది ఆయన కపట ప్రేమకు నిదర్శమని పేర్కొన్నారు. తాము పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. కరోనాకాలంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచామన్నారు. కరోనా మృతులకు దగ్గరుండి అంత్యక్రియలు చేయించామని గు ర్తు చేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను గౌరవించి ప్రోత్సహించామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ట్రస్టు మోటివేషన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అనుసంధానంగా ఈ నెల 20న మెగా జాబ్ మేళాకు శ్రీకారం చుట్టామన్నారు. 40 కంపెనీల సహకారంతో ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
పేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలతా శంకర్‌లాల్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు కుర్రు లింగయ్య, వీకే.రవి, గర్రెపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, ఆకుల కిరణ్, పూదరి సత్యనారాయణగౌడ్, కొండ రవీందర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.