నేతన్నచౌరస్తా/కోనరావుపేట/ముస్తాబాద్/గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/సిరిసిల్ల రూరల్, జనవరి 21: రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు తీరాన మాఘమాస జాతర శనివారం ఘనంగా జరిగింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానంగా సిరిసిల్ల శివారులోని మానేరు సమీపంలో శనివారం గంగాభవానీ, శ్రీమడేలేశ్వరస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామి జాతరలు వైభవంగా జరిగాయి. ఆయా కుల సంఘాల ప్రతినిధులు తమ ఆరాధ్య దైవాలను మానేరు సమీపంలోని ఆలయాలకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సంప్రదాయబద్ధంగా కల్యాణ వేడుకలు జరిపించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు..కల్యాణ వేడుకలు తిలకించి పులకించిపోయారు. దీంతో సిరిసిల్ల మానేరు తీరం పులకించింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన వేడుకలు రాత్రి వరకూ కొనసాగాయి.
కిటకిటలాడిన మామిడిపల్లి
వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయం అయిన కోనరావుపేట మండలం మామిపడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయ ఆవరణలో మాఘమాస జాతర ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70వేలకు పైగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఎడ్లబండ్లు, వాహనాలలో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు చెట్ల కింద సహపంక్తి భోజనాలు నిర్వహించి ఉత్సహంగా గడిపారు. అలాగే నాగారం కోదండరామస్వామి ఆలయం, ధర్మారంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ ఆవరణలో మాఘ అమవాస్యను ఆలయఅధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్వహించారు.
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చిన్నచీకోడులో గుట్టపై వెలసిన స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ‘మాఘ అభిషేకం’ ప్రత్యేక పూజలు, సహ్రస నామార్చన, సాయంత్రం గిరి ప్రదర్శన (గుట్ట చుట్టు బండ్లుతిరుగుట) కార్యక్రమాలు నిర్వహించారు. పోతుగల్లో రాములోరి బండపై వెలిసిన శ్రీసీతారాముల ఆలయంలో, మండల కేంద్రంలో వెంకటేశ్వర బోరు గుట్టపై వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎల్లారెడ్డిపేటలోని కేశవ పెరుమాండ్ల స్వామి ఆలయం, అక్కపల్లిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, గొల్లపల్లిలోని గాలన్ గుట్ట హనుమాన్ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.
స్వామి వార్లను దర్శించుకున్న ప్రముఖులు..
మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో జడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పూజలు చేశారు. ఎల్లారెడ్డిపేట, మామిడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. సిరిసిల్ల, గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో నాఫ్స్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సిరిసిల్లలో ఎస్పీ రాహుల్ హెగ్డే, మంత్రి కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పాల్గొని పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పవర్‌లూం, టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.