జగిత్యాల, ఏప్రిల్ 16: దేశమంతా మంచిగా ఉండాలని ఆనాడు జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారని, ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలని, రేవంత్ ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతున్నారని కేసీఆర్ సభ జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 20న జగిత్యాల మినీ స్టేడియంలో నిర్వహించే జనహిత సభా స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం సాయంత్రం ఆయన పరిశీలించి, మాట్లాడారు. పోరాడి సాధించిన రాష్ర్టాన్ని కేసీఆర్ పదేండ్ల పాలనలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, కానీ, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నిండా ముంచిందన్నారు. జగిత్యాల సభతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రకు పునాది పడుతుందని, కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని సూచించారు. జగిత్యాల సభ విషయం తెలిసి రేవంత్ భయపడుతున్నారని, సభను అడ్డుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేందుకు రాజకీయ కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.
ఇన్నాళ్లూ పనికిరాని కాళేశ్వరం అని మాట్లాడిన రేవంత్, జనహిత సభ సక్సెస్ కాకుండా అదే రోజు మేడిగడ్డ బరాజ్ వద్ద సభ పెట్టేందుకు చూస్తున్నారని దుయ్యబట్టారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టుల వద్ద తట్టెడు మట్టి ఎత్తని, గత మూడు బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కేటాయించని రేవంత్ సర్కార్ మోసాలను ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పారు. సభకు ప్రజలు రాకుండా ఉండేందుకు జగిత్యాల-నిజామాబాద్ ప్రధాన రహదారిపై బ్రిడ్జిని తవ్వుతున్నారని, రెండున్నరేండ్ల క్రితమే టెండర్ పూర్తయిందని, ఇన్నాళ్లూ గురుక్తురాని పనులు ఇప్పుడేందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జగిత్యాల సభకు బస్సులు ఇవ్వద్దని రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి ప్రాంతంలో అధికారులను కరీంనగర్ జిల్లా మంత్రులు బెదిరిస్తున్నారని, ఎవరు బెదిరించినా అదిరించినా, ఇద్దరు వచ్చే దగ్గర నలుగురు సభకు వచ్చి సక్సెస్ చేస్తారన్నారు.
ప్రభుత్వం ఎన్ని అడ్డుంకులు సృష్టించినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలివస్తారన్నారు. అంతకుముందు జీవన్ రెడ్డి ఇంట్లో కార్యకర్తల సమావేశంలో పల్లా మాట్లాడారు. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అని, 40 ఏండ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. చివరకు కాంగ్రెస్ చేసిన మోసంతో బయటికి వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్న జీవన్ రెడ్డికి స్వాగతం పలుకాలని సూచించారు. ఇక్కడ మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకంట్ల, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, లోక బాపురెడ్డి, దావ సురేశ్, అయిల్నేని వెంకటేశ్వర్ రావు, అవారి శివకేసరి బాబు, దుర్వయ్య, శీలం ప్రవీణ్ పాల్గొన్నారు.