విద్యానగర్, జనవరి 12: జిల్లాలో ఈనెల 18వ తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ కార్యాలయంలో గురువారం ఆయన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేసిందన్నారు. జిల్లాలో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు 48 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఉదయం 9 గంటలకు ప్రారంభించాలని సూచించారు. ఆయా గ్రామాల్లో క్యాంపుల నిర్వహణకు గదులు, టాయ్లెట్లు, కుర్చీలు, ఇతర సామగ్రిని సర్పంచులు సమకూర్చాలని పేరొన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రచారం చేయాలని ఆదేశించారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ శిబిరానికి వచ్చేలా చూడాలన్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో 100 రోజులు కంటి శిబిరాలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. క్యాంపుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. జిల్లాలోని వైద్యాధికారులు, ఇన్చార్జులు, మండల ప్రత్యేకాధికారులు ప్రతి రోజు వారి పరిధిలోని క్యాంపులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా వైద్యాధికారి జువేరియా, డీఆర్డీవో శ్రీలతారెడ్డి, డీపీవో వీరబుచ్చయ్య, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ రత్నమాల, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.