ధర్మారం, సెప్టెంబర్ 1: ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రజలు, ప్రజా ప్రతినిధులకు జవాబుదారీగా ఉండాలని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ సూచించారు. ధర్మారం మం డల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. సమావేశానికి అధికారులు అంతా హాజరై ముగిసే దాకా ఉండాలని సూచించారు. లేదంటే చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులపై ఆరోగ్య, పశువైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్వశక్తి సంఘాల సమావేశాలు, ఎన్నికలపై ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సెర్ప్ ఏపీఎం కనకయ్యకు సూచించారు. నంది మేడారం జడ్పీ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇటీవల జరిగిన స్వాతంత్య్ర వేడుకులకు స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకుండా అవమానపరిచారని ఎంఈవో ఛాయాదేవి దృష్టికి నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మిట్ట తిరుపతి తీసుకెళ్లారు. ఇక ముందు అలా జరుగకుండా చర్యలు తీసుకుంటామని ఎంఈవో హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు అధికారులు పరిష్కరించినప్పుడే గ్రామాల్లో ప్రజాప్రతినిధులకు గుర్తింపు ఉంటుందని కటికెనపల్లి ఎంపీటీసీ సభ్యుడు సూరమల్ల శ్రీనివాస్ అన్నారు.
న్యూ కొత్తపల్లి, బుచ్చయ్యపల్లిలో ప్రజలకు ప్రతినెలా రేషన్ సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను బలరాంరెడ్డి కోరారు. దొంగతుర్తిలో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ దాడి సదయ్య, జక్కన్నపల్లి నుంచి ఎస్టీ గురుకులం వెళ్లేదారిలో వీధిలైట్ల ఏర్పాటు కోసం తీగెను ఏర్పాటు చేయాలని ఏఎంసీ చైర్మన్, ఊరకుంటలో వంగిన స్తంభం తొలగించాలని మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫి కోరగా తగిన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో ఏఈలు రాజేందర్, సురేశ్ చెప్పారు. బొమ్మారెడ్డిపల్లిలో జీపీ కార్యదర్శి పనితీరు బాగా లేదని ఎంపీటీసీ గాగిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి సభ దృష్టికి తీసుకురాగా కార్యదర్శికి జీత భత్యాలు నిలిపివేశామని అతను బదిలీ అయినట్లు ఎంపీడీవో వివరణ ఇచ్చారు. మల్లాపూర్‌లో జీపీ కార్యదర్శి తనకు తెలియకుండా ఇంటి అనుమతి ఇస్తున్నాడని సర్పంచ్ గంధం వరలక్ష్మి ఆరోపించారు. రైతులు ఆయిల్ఫామ్ తోటల సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని ఉద్యాన వన అధికారి జ్యోతి తెలిపారు. సమావేశంలో వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి తదితరులున్నారు.