పదేళ్లు పరిశ్రమలకు ఫుల్ కరెంట్
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. దేశ ఉత్పత్తిలో భాగస్వాములైన పరిశ్రమల నిర్వాహకులు ఇందుకు అతీతులేమీ కాలేదు.
- ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం కోతలు
- పవర్ హాలీడేలు.. ఆంక్షలు
- స్వరాష్ట్రంలో విద్యుత్ వెలుగులు
- ఇండస్ట్రీలకు తప్పిన జనరేటర్ల మోతలు
- గణనీయంగా పెరిగిన పరిశ్రమలు
- వేలాది మందికి ఉపాధి అవకాశాలు
- కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలవుతున్న ఇ‘కట్’లు
- ఆగ్రహిస్తున్న పరిశ్రమల నిర్వాహకులు
- చీకట్లను తరిమిన కేసీఆర్‌పై నిందలు సరికాదని హితవు
పదేళ్ల కేసీఆర్ పాలనలో పారిశ్రామికీకరణ పరుగందుకున్నది. అందుకు ప్రభుత్వం తెచ్చిన నూతన విధానాలే కాదు, నాణ్యమైన కరెంట్ కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో పవర్హాలీడేలు, మరెన్నో ఆంక్షల మధ్యన పరిశ్రమలు మూతపడగా.. స్వరాష్ట్రం వచ్చిన ఆరు నెలల్లోనే పరిస్థితి మారింది. విద్యుత్ వెలుగులతో పవర్ హాలీడేలకు బ్రేక్ పడింది. అప్పటిదాకా వినిపించిన భారీ జనరేటర్ల మోతలు ఆగిపోయాయి. ఎన్నో పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడమే కాదు, వేలాదిగా కొత్త పరిశ్రమలు వెలిశాయి. వేలాది మంది వలస కార్మికులకు ఉమ్మడి జిల్లా ఉపాధి కేంద్రంగా మారింది. విద్యుత్ సంస్కరణలు తెచ్చి పరిశ్రమలను ప్రోత్సహించింది కేసీఆరేనని ప్రతి పరిశ్రమ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి నాయకుడిపై నిందలు మోపడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు తేవద్దని కోరుతున్నారు.
కరీంనగర్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ప్రజలు నరకయాతన పడ్డారు. దేశ ఉత్పత్తిలో భాగస్వాములైన పరిశ్రమల నిర్వాహకులు ఇందుకు అతీతులేమీ కాలేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని గందరగోళ పరిస్థితి అప్పటిది. వారానికో తీరు షెడ్యూలు అమలు చేసేవాళ్లు. ఆ షెడ్యూల్ ప్రకారంగానైనా కరెంట్ ఇచ్చేవాళ్లు కాదు. ఈ కారణంగా పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర నష్టాలను చవిచూసేవాళ్లు. సాధారణంగా ప్రతి రోజూ ఉదయం రెండు, సాయంత్రం రెండు గంటల అధికారిక కోతలు విధించేవారు. కానీ, విద్యుత్ కేటాయింపులు తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న కారణంగా నిత్యం గ్రిడ్‌లో సమస్యలు తలెత్తేవి.
ఫలితంగా సరఫరాలో నిత్యం అంతరాయం కలిగేది. దీనికి తోడు పవర్ హాలీడేలు ప్రకటించేవారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు రెండు మూడు రోజులు పరిశ్రమలు నడిచేవి కాదు. రాత్రి వేళ పీక్ అవర్ పేరుతో పరిశ్రమలు నిర్వహించరాదని ఆంక్షలు విధించేవారు. దీంతో అనేక పరిశ్రమలు కుదేలయ్యాయి. ఉత్పత్తి లక్ష్యాలను సాధించక పోవడం, లేబర్ ఖర్చులు మీద పడడం వంటి కారణాలతో పరిశ్రమల నిర్వాహకులు నష్టాలు చవిచూడాల్సి వచ్చేది. అనేక పరిశ్రమల్లో భారీ జనరేటర్లు ఏర్పాటు చేసుకునేవారు. దీని ఖర్చు తడిసి మోపెడయ్యేది. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు నడపలేక చాలా మంది మూసేసుకున్నారు. వాటినే నమ్ముకుని బతికిన వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి.
నాడు ఆరు నెలల్లోనే మారిన సీన్
తెలంగాణ ఏర్పడిన ఆరు నెలలకే పరిశ్రమల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయడంతో వెలుగులు నిండాయి. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం, విద్యుత్ రంగాలపై దృష్టి సారించారు. రాష్ట్రం ఏర్పాటైతే చీకటిమయం అవుతుందన్న ఆంధ్రా నాయకుల కళ్లు చెదిరే రీతిలో పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించారు. దాంతో పరిశ్రమల నిర్వాహకులు నాడు ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం పడిన కష్టాలన్నింటినీ మర్చిపోయారు. అనతి కాలంలోనే నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంతో జనరేటర్ల మోతలు మాయమయ్యాయి. మూతపడ్డ అనేక పరిశ్రమలు తెరుచుకోవడమే కాదు, కొత్త పరిశ్రమలు వేలాదిగా వెలిశాయి. చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికులు ముందుకు వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లులు, గ్రానైట్ పరిశ్రమలు కోకొల్లలుగా ఏర్పడగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ కారణంగా ఉత్తత్తి లక్ష్యాలు నెరవేరి, నిర్వాహకులు లాభాల బాట పట్టారు.
కేసీఆర్ లేకుంటే ఏమయ్యే వాళ్లమో..
ఉమ్మడి రాష్ట్రంలో చీకటి రోజులను గుర్తు చేసుకుంటున్న పరిశ్రమల నిర్వాహకులు, కేసీఆర్ అధికారంలోకి రాకుంటే ఏమయ్యే వాళ్లమోనని ఇప్పటికీ చెబుతున్నారు. ఆయన వచ్చిన తర్వాతనే పరిశ్రమలకు మంచి రోజులు వచ్చాయని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారం వెలగబెట్టిన టీడీపీ, కాంగ్రెస్ పరిశ్రమలకు ఎందుకు నాణ్యమైన విద్యుత్‌ను అందించలేక పోయాయని ప్రశ్నిస్తున్నారు. 2014కు ముందు ఉన్న పరిస్థితులు తలుచుకుంటే భయం వేస్తున్నదని, కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని గందరగోళ పరిస్థితులు ఉండేవని, కనీసం షెడ్యూల్ ప్రకారంగా కూడా కరెంట్ సరఫరా చేయలేక అప్పటి ప్రభుత్వాలు చేతులెత్తేశాయని గుర్తు చేస్తున్నారు. అలాంటి దుస్థితి నుంచి పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించి తమను ఆదుకున్నది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ చూపిన బాటలో నడిస్తే ఎక్కడ ఏ సమస్య రాకుండా కరెంట్ సరఫరా అవుతుందని చెబుతున్నారు.
ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ విద్యుత్ కోతలు లేకుండా చేసి రైతాంగానికి అండగా నిలిచిండు. కరెంట్ రందీ లేకుండ చేసిండు. ఎప్పుడుపడితే అప్పుడు మోటర్లు చాలు చేసేది. కానీ, ఇప్పుడా పరిస్థితి కన్పిస్తలేదు. ఉమ్మడి రాష్ట్రంలనన్న పలానా టైమ్ నుంచి ఈ టైమ్ దాకా కరెంట్ ఉండదని ముందే తెలిసేది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు అప్రకటిత కోతలు పెడుతుంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు.
-ఎం రామకృష్ణ, రైతు పెర్కపల్లి (పెద్దపల్లి)
కరెంటిచ్చినోళ్లపై నిందలు మోపడం బాధాకారం
నేను పదిహేనేళ్ల కిందటి నుంచి వ్యవసాయ మోటర్లు రిపేరు చేస్తున్న. వీర్నపల్లిలోనే చిన్న ఇల్లు తీసుకుని వర్క్‌షాపు పెట్టుకుని పనిచేసుకుంటున్న. ఉమ్మడి రాష్ట్రంల ఉన్నపుడు కరెంటు సక్కగ ఉండకపోయేది. ఒకవేళ ఉన్నా లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయేవి. ఒక్కో రైతు మోటర్ నెలలో రెండు సార్లు కాలిపోయేటిది. దీంతో పంటకు నీళ్లందక ఎండిపోయేవి. రిపేరు చేసిన మోటర్లకు పైసల్లేక మల్ల పంటకు ఇస్తమని గోసోలె అంటుంటె మనసు బాధనిపిస్తుండె. గిట్ల చాలా మంది రైతులు కరెంటు కోసం గోస పడ్డరు. తిండి గింజలకు గిలగిల కొట్టుకున్నరు. కరెంటు తిప్పలు అప్పులు పాలు చేసినయ్. తెలంగాణ వచ్చినంకనే కరెంటు తిప్పలు తప్పినయ్. నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతులను కేసీఆర్ ఆదుకున్నడు. అలాంటి సారుపై నిందలు మోపడం పాపం.
– పర్లపల్లి బాబు, మోటర్ మెకానిక్, మద్దిమల్ల గ్రామం (వీర్నపల్లి మండలం)
మళ్లీ మోటర్లు కాలిపోతున్నయ్
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రెప్ప పాటు కూడా కరెంట్ పోకుండా చూసిండు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించిండు. దీనివల్ల మోటర్లు కాలిపోలేదు. పదేళ్లపాటు పెద్దగా వైండింగ్ చేయలేదు. ఐదారు నెలలుగా గంటకోసారి కరెంట్ ట్రిప్ అవుతున్నది. ఈ ఎండాకాలంలో ఫ్యాన్లు, కూలర్లు కాలిపోయి వైండింగ్ గిరాకీ పెరిగింది. పదేళ్ల నాటి పరిస్థితులే మళ్లీ వచ్చినై. తొమ్మిదేండ్లు మోటర్లు కాలిపోకపోవడంతో రైతులు సంతోషంగా ఉన్నరు. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ అందక మళ్లీ మోటర్లు కాలిపోతున్నయ్. రైతులు కన్నీరు పెడుతున్నరు. చిన్న గాలికే కరెంట్ పోతంది. కాంగ్రెస్ సర్కారుకు ప్రజల అవసరాల మీద పెద్దగా పట్టింపు లేదు. విద్యుత్ ఒప్పందాల విషయంలో కేసీఆర్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నడు ప్రస్తుత ముఖ్యమంత్రి.
– పోలం సతీశ్, ఎలక్ట్రీషియన్ (వైండర్) పెద్దపల్లి
పదేళ్లు ఏ ఇబ్బంది లేకుంట నడిపినం
2014 కంటే ముందు పరిశ్రమలకు కరెంటు కోసం అనేక ఇబ్బందులు పడ్డం. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పీక్ అవర్స్, నాన్ పీక్ అవర్స్ అని పెట్టి.. పొద్దున 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు పరిశ్రమలు విద్యుత్ వాడకుండా కట్టడి చేశారు. ఆ సమయాల్లో ఒకవేళ విద్యుత్ వాడితే అనేక జరిమానాలు విధించారు. అలా జరిమానాలు పరిశ్రమల మీద రూ.లక్షలు వేయడంతో చెల్లించలేక ప్రభుత్వ వైఖరిపై నాడు హైకోర్టుకు వెళ్లి కేసు నడిపించాం. ఆ విషయం కోర్టులో ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ ఇప్పటి వరకు కూడా ఆ జరిమానాలపై 24 శాతం వడ్డీ వేస్తూ రెగ్యులర్‌గా కట్టే బిల్లులో వసూలు చేస్తున్నది. ఆనాటి ప్రభుత్వంలో మేం పడ్డ బాధలు వర్ణనాతీతం. 2014 నుంచి మా పరిశ్రమలు నడుపుకునేందుకు డైరెక్ట్ ఫీడర్లు ఏర్పాటు చేసి పరిశ్రమల ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేసింది. ఇప్పుడు మళ్లీ మధ్య మధ్యలో నాణ్యమైన విద్యుత్ రాకుండా పరిశ్రమ నడిపేందుకు ఇబ్బంది అవుతుంది. మోటర్లు పాడవుతున్నయి. ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాల మీద రాజకీయాలు మానుకొని పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందజేయాలి. గతంలో కాంగ్రెస్ సర్కారు వేసిన జరిమానాను మాఫీ చేయాలి.
– బోయినపల్లి ప్రభాకర్‌రావు, గ్రానైట్ పరిశ్రమ యజమాని(తిమ్మాపూర్)
కోతల్లేకుండా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే…
తెలంగాణ రాకముందు కరెంట్ కోతలతో చెప్పరాని కష్టాలు పడ్డం. కేసీఆర్ పాలనలో ఊహకందని విధంగా 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగింది. దీంతో రాష్ట్రం అభివృద్ది పథంలో నడిచింది. తెలంగాణ వస్తే మీకు కరెంట్ సమస్యలు వస్తాయని బీరాలు పలికిన వాళ్ల నోళ్లు మూతపడ్డయ్. పదేళ్లపాటు తెలంగాణ ప్రజలకు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చిన కేసీఆర్‌ను విద్యుత్ ఒప్పందాలపై నిలదీయడం సరికాదు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రంగాలకు కోతల్లేని విద్యుత్ అందించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఉందన్న విషయాన్ని గుర్తెరుగాలి.
– యాటం కృష్ణంరాజు, సీటీ స్కాన్ నిర్వాహకుడు (కోరుట్ల)
సగం మిషన్లు నడువకపోయేది
పదేళ్లుగా ఇండస్ట్రీ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. 2014కు ముందు పరిశ్రమలకు కరెంటు సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. రోజూ కనీసం సగం పని గంటలైనా మిషన్లను నడపకపోయేది. ఆర్థిక ఇబ్బందులతో ప్రతి నెలా పరిశ్రమ నిర్వహణ, జీతాలు, ఇతర ఖర్చులను అతి కష్టం మీద మోయాల్సి వచ్చేది. 2014 తర్వాత పరిశ్రమలకు మంచి రోజులు వచ్చాయి. కరెంటు ఇబ్బందులు క్రమంగా తొలగిపోయాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిశ్రమ సజావుగా నడుస్తున్నది. కరెంటు సమస్య లేనందున పరిశ్రమను పూర్తి సామర్థ్యంతో రన్ చేస్తున్నాం. నిత్యం పది మందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది.
– కృష్ణారెడ్డి, సుజనా యూపీవీసీ విండో మాన్ ఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యజమాని, కరీంనగర్(ముకరంపుర)
ఇక ముందు ఎన్ని కష్టాలు చూడాల్నో..
ఆర్నెళ్ల కిందటి వరకు కరెంటు సరఫరా వేరు.. ఇప్పుడు వేరు.. నేను బోర్ మోటర్లు బిగించడానికి వెళ్లేది. గత పదేళ్లలో అస్సలు కరెంట్ పోకపోతుండె. మోటర్ ఫిట్ చేసి తొందరగా వచ్చి దుకాణంలో ఇంకో పని చేసుకునేటోళ్లం. కానీ, ఇప్పుడు మోటర్లు ఫిట్ చేయడానికి వెళ్తే కరెంట్ పోవడంతో ఒక పూట అక్కడే గడిచిపోతంది. దీని వల్ల రిపేర్‌కు వచ్చిన మెటార్ల పని ఆలస్యమైతంది. దుకాణాల్లో ఉన్న మోటర్లు సరైన టైంల ఇవ్వలేకపోతున్నం. ఇక ముందు ఎలాంటి కష్టాలు చూడాల్సి వస్తుందో.
– పీ చారి, బోర్ మెకానిక్, జగిత్యాల
పదేళ్లు కరెంట్ సమస్య రాలె..
నేను స్వర్ణకార పని చేస్తున్న. గత పదేళ్ల నుంచి విద్యుత్ సమస్య అంతగా రాలె. ప్రతి శనివారం మెయింటనెన్సు కోసం అంతరాయం ఉండేది. మిగతా రోజుల్లో మాత్రం కరెంటు కోతలు చూడలేదు. కానీ గడిచిన ఆర్నెళ్ల నుంచి కాంగ్రెస్ సర్కారు వచ్చినంక విద్యుత్ సమస్యలు వస్తున్నయ్. పెళ్లిళ్ల సీజన్లో విద్యుత్ కోతలతో సతమతమైనం. వానకాలంలో కూడా విద్యుత్ సమస్య తీవ్రమైంది. కరెంట్ లేక తీగ మెషిన్‌ను మరొక మనిషి సహాయంతో తింపుకునే పరిస్థితి వచ్చింది. కరెంటు కోతలు ఇలాగే ఉంటే రాబోయే పెళ్లిళ్ల సీజన్లో మాకు ఇబ్బందులు తప్పవు.
– కత్రోజు అజయ్, స్వర్ణకారుడు (జగిత్యాల)
గంటకో సారి కరెంట్ పోతంది..
కాంగ్రెస్ సర్కారు వచ్చినంక గంటకోసారి కరెంట్ పోతంది. మెస్‌డోర్ వర్క్స్ సక్కగ జరుగుతలేవు. కస్టమర్లు అడిగితే ఏం చెప్పాలో తెల్వక ఇబ్బందులు పడుతున్నం. కరెంట్ ఉంటేనే మా పని నడుస్తది. కరెంట్ పోయినంత సేపు నాతోపాటు ఇద్దరు వర్కర్లం కూడా ఖాళీగా కూర్చుంటున్నం. పని చేసేటప్పుడు కరెంట్ పోతే చిరాకు అనిపిస్తది. ఇక పని అక్కడే ఆగిపోతది. గత ప్రభుత్వ హయాంలో 24 గంటలు కరెంట్ ఉండేది. కరెంట్ పోవుడు చాలా అరుదు. అప్పుడు పని మంచిగ సాగింది. కరెంట్‌పై గత ప్రభుత్వాన్ని నిందించడం కంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించగలమో ప్రస్తుత సర్కారు ఆలోచనలు చేయాలె.
-నూతి తిరుపతి, కార్పెంటర్ (మెస్ డోర్ వర్క్స్), పెద్దపల్లి
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- 24 hours current
- BRS
- Congress
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

