పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్టు తయారైంది. ఇప్పటికే అనేక విధులు, సర్వేలతో సతమతమవుతుండగా, ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరిట మరోభారం మోపుతున్నది. ఇబ్బందులు ఎదురైనా వెనుకో ముందో సర్వేను చేసేందుకు సెక్రటరీలు సుముఖత చూపుతున్నా.. లబ్ధిదారుల గుర్తింపు మాత్రం ప్రాణసంకటంగా మారుతున్నది. ఈ నిబంధన వల్ల భవిష్యత్‌లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని, ఎంపిక ప్రక్రియను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలంటూ ముక్తకంఠంతో చెబుతున్నా సర్కారు మాత్రం ససేమిరా అంటున్నది.
మరోవైపు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు సమయం ఇవ్వాలని కోరుతున్నా వినిపించుకోకుండా కచ్చితంగా ఈనెల31లోగా కంప్లీట్ చేయాలని మెడపై కత్తి పెడుతున్నది. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న నేపథ్యంలో మరో సర్వే చేయించడంతోపాటు శక్తికి మించి టార్గెట్ ఇస్తూ ఒత్తిడి చేయడంతో సెక్రటరీలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వేలో ఎదురయ్యే సమస్యలతోపాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి జిల్లాలోని ఉన్నతాధికారులకు పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజ్ఞప్తులు, విన్నపాలు చేస్తున్నారు. అయినా ఎవరూ కరుణ చూపడం లేదని వాపోతున్నారు. పైగా క్షేత్రస్థాయి ఇబ్బందులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా సర్వేకు ఒత్తిడి చేయడంపై లోలోన కుమిలిపోతున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కమాన్‌పూర్ : కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటి విడుత ప్రతి నియోజకవర్గానికీ 3,500 చొప్పున ఇండ్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు 45,500 ఇండ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్‌ను అమల్లోకి తెచ్చింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు యాప్ డౌన్లోడ్ చేసేందుకు యూజర్ ఐడీలు కేటాయించారు.
సర్వే చేసే ఉద్యోగులకు మొయిల్ ఐడీలు రూపొందించి లాగిన్ ఇస్తున్నారు. ఆ అధికారులు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లు లేదా ఆ స్థలం వద్దకు వెళ్లి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేయాలి. సదరు దరఖాస్తుదారుడి ప్రస్తుత ఇంటి నివాసానికి సంబంధించిన ఫొటోలు, గోడలతో సహా తీసి అప్లోడ్ చేయాలి. అలాగే డాక్యుమెంట్లు తీసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా ఇంటిపన్ను లేదా సాదాబైనామా అయినా సరే తీసుకొని సదరు డాక్యుమెంట్‌ను 5ఎంబీకి కుదించి అప్లోడ్ చేయాలి. దరఖాస్తుదారుడి ఫొటోలు, ఇంట్లో బయట తీయడంతోపాటు సదరు వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు అర్హుడా.. అనర్హుడా..? కూడా నమోదు చేయాలి.
నిజానికి యాప్‌లో సదరు దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు నమోదు చేసి సర్వే చేయాలంటే.. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వే చేసినా అందులో అన్నీ సవ్యంగా ఉంటే 20 మందికి మించి చేయలేమని కార్యదర్శులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రోజుకు 50కిపైగా చేయాలని ఒత్తిడి తెస్తున్నదని, ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఒక సెక్రటరీ నిర్ణీత సమయంలో 200 ఇండ్లకు మించి సర్వే చేయలేరని వాపోతున్నారు. ఎక్కువ దరఖాస్తుదారులు, ఇండ్లు ఉన్న గ్రామాల్లో అదనంగా సిబ్బందిని నియమించాలని, వారికి ప్రత్యేకంగా ఐడీలు కేటాయించి సర్వే చేయించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు విన్నవించామని, అయినా తమ మొర అరణ్యరోదనే అవుతున్నదని ఆవేదన చెందుతున్నారు.
అష్టకష్టాలు పడైనా సర్వే చేస్తామని చెబుతున్న పంచాయతీ కార్యదర్శుల నుంచి ఒకటి రెండు అంశాలపై మాత్రం బలంగా వ్యతిరేకత కనిపిస్తున్నది. దరఖాస్తుదారుడి వివరాలు సేకరించేందుకు వెళ్లి, అక్కడే ఫొటోలు తీసుకొని సదరు దరఖాస్తుదారు ఇందిరమ్మ ఇంటికి అర్హుడా.. అనర్హుడా..? అన్నది సదరు యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడుతున్నది. గ్రామంలో ఏ ఒక్కరికి రాకపోయినా సదరు వ్యక్తులంతా భవిష్యత్‌లో పంచాయతీ కార్యదర్శులపై పిర్యాదుల పరపంర కొనసాగించే అవకాశమున్నది. అంతేకాదు, నిలదీతలు, ధర్నాల వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.
దీంతో కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అర్హులను తేల్చే ప్రక్రియను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ముక్తకంఠంతో సర్కారును కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటున్నది. ఈ విషయంలో భవిష్యత్‌లో తలెత్తే పరిణామాల నేపథ్యంలో కనీసం ఒక పంచాయతీ కార్యదర్శిని మరో పంచాయతీలో సర్వే చేయించాలని కోరుతున్నా విముఖత చూపుతున్నది. దీంతో కార్యదర్శులు వెనుకడుగు వేయాలని ముందుగా నిర్ణయించుకున్నా.. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సర్వేను కొనసాగిస్తున్నది. ఈ పరిస్థితుల్లో పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది.
తమపై పని భారం పెరుగుతున్నా సర్వే చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ పరిస్థితుల్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నాలుగు జిల్లాల్లోనూ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. అందులో ప్రధానంగా కార్యదర్శులకు విధులు, సర్వేలు కేటాయించేటప్పుడు వాట్సాప్ మెసేజ్‌లు, జూమ్ మీటింగ్‌ల ద్వారా కాకుండా ప్రత్యేకంగా సర్క్యులర్ ద్వారా ఆదేశాలివ్వాలని, సెలవు రోజుల్లో సర్వేకు మినహాయించాలని, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సివస్తే ఆ సెలవులను తర్వాత వాడుకునే వెసులుబాటు (కంపెన్సేటరీ లీవ్స్) కల్పించాలని, సర్వే చేసినందుకు తగిన పారితోషికం ఇవ్వాలని కోరారు.
అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసం పంచాయతీలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున తగినంత సమయం ఇవ్వాలని, టార్గెట్లు పెట్టి ఇబ్బంది పెట్టరాదని, ఇండ్ల అర్హుల గుర్తింపు ఇందిరమ్మ గ్రామస్థాయి కమిటీలకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. జేపీఎస్‌ల నాలుగేళ్ల ప్రొబెషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని, ప్రమోషన్ వంటి అంశాలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గ్రామపంచాయతీ నిర్వహణ ఖర్చుల భారం మొత్తం కార్యదర్శులు భరిస్తున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి జీపీలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని విన్నవించారు. నిజానికి మెజార్టీ డిమాండ్లు పరిష్కరించే అధికారం జిల్లా ఉన్నతాధికారుల చేతుల్లో ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. డిమాండ్లపై ఎటువంటి స్పష్టతనివ్వకుండా సర్వే చేసి తీరాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తుండడంతో కార్యదర్శులు మానసికంగా కుంగిపోతున్నారు.
సర్వే చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లను ఉన్నతాధికారుల ముందు పెట్టాం. పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అయితే లబ్ధిదారులు అర్హులా.. కాదా..? అని తేల్చే ప్రక్రియను మాత్రం ఇందిరమ్మ కమిటీలకు అప్పగించాలని ముక్తకంఠంతో కోరుతున్నాం. ఈ డిమాండ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అలాగే మా విధులకు భిన్నంగా సర్వేలు చేసినప్పుడు మాకు అదనపు రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయంలోనూ అధికారులు ఆలోచించాలి. ప్రధానంగా క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నాం. యాప్‌లో ఉన్న అంశాలను పూర్తి చేసి సమగ్రంగా సర్వేచేయాలంటే రోజుకు 15 ఇండ్లు చేయడమే కష్టం అవుతుంది. మాపై ఒత్తిడి పెంచడం వల్ల ఇబ్బందులు పెరిగుతాయి. దీనిని గుర్తించిన మాకు అన్ని రకాలుగా సహకరించాలని కోరుతున్నాం.
– జీ అజయ్‌కుమార్, కరీంనగర్ జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు