Gundlapalli | తిమ్మాపూర్, జూలై 23 : మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడు గుండ్లపల్లి గ్రామానికి చెందిన వంగాల మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి వారం క్రితం ఎల్ ఎండీ లోని ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయ వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే.
వారం రోజులుగా కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి, మృతుడు రాజేందర్ రెడ్డి ఒక గ్రామానికి చెందినవారు. అయితే బీజేపీలో ఉన్న రాజేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి గెలుపు కోసం కష్టపడ్డారు. అయితే గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై రాజేందర్ రెడ్డి తరచు గళం విప్పేవారు. దాంతోపాటు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించేవారు. దీంతో ఇద్దరు వల్ల మధ్య వైరం ఏర్పడినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే ఇటీవల రాజేందర్ రెడ్డి కి చెందిన బ్రిక్స్ వద్ద వడ్లురుకు చెందిన ఇద్దరు మద్యం సేవిస్తుండగా ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త ఎస్సీ, ఎస్టీ కేసు వరకు వెళ్లింది. అయితే ఈ కేసు వెనుక మురళీధర్ రెడ్డి హస్తం ఉందంటూ రాజేందర్ రెడ్డి మొదటినుంచి ఆగ్రహంగా ఉన్నారు.
ఎమ్మెల్యేకు చెప్పుకుందామని వెళ్తే..
ఈ విషయంపై ఎమ్మెల్యే కవంపల్లి వద్ద తేల్చుకుందామని వెళ్తే ఆయన అందుబాటులో లేకపోతే, కాల్ చేసిన స్పందించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన రాజేందర్ రెడ్డి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని కోపంతో నిప్పంటించుకున్నాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆయన్ను ఎల్ఎండీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా ఆయన ఆస్పత్రిలో వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం రాత్రి మృతి చెందాడు. రాజేందర్ రెడ్డి మృతితో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, గుండ్లపల్లి స్టేజి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుండగా, అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తీసుకువచ్చి ధర్నా చేయాలని కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.