కరీంనగర్/రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): గాలివాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు, ఎలబోతారం, గ్రామాల్లో విపరీతమైన వర్షం పడింది. కోతకు వచ్చిన వరి చేళ్లు నేలవాలాయి. రైతులు కల్లాల్లో ఆరబోసుకున్న ధాన్యం తడిసింది. దుర్షే డు, గోపాల్పూర్ గ్రామాల్లో మామిడి కాయలు నేల రాలాయి. రామడుగు మండలంలో వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. మండలంలోని కుర్మపల్లిలో ముగ్గురు గొర్రెల కాపర్లకు చెందిన 17 గొర్రెలు గోడ కూలి మృత్యువాత పడ్డాయి. గోపాల్పూర్, షానగర్, పందికుంటపల్లి, రామడుగు గ్రామాల్లో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసి ముద్దయ్యాయి.
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్, తిమ్మాపూర్, మహాత్మానగర్, పర్లపల్లి, మొగిలిపాలెం, తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం పెద్ద మొత్తంలో తడిసింది. మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి హన్మా న్ ఆలయం వద్ద కరీంనగర్, వరంగల్ రహదారిపై పెద్ద చెట్టు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. కొండపల్కల, చెంజర్ల, గంగిపెల్లి, ఈదులగట్టెపల్లి తదితర గ్రా మాల్లో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. చొప్పదండి, గంగాధర, శంకరపట్నం తదితర మండలాల్లో కూడా వర్షం కురిసింది. అక్కడక్కడా రైతుల ధాన్యం కుప్పలు తడిశాయి. చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది.
ధాన్యం గింజలు నేల రాలాయి. మామిడి తోటలలో మామిడి కాయలు నేలరాలాయి. సుందరగిరి గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వద్ద భారీ వర్షానికి చెట్లు విరిగిపడడంతో కరీంనగర్ హుస్నాబాద్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంతో పాటు పలు గ్రా మాల్లో గాలివాన బీభత్సానికి కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడవగా, కోతకు రాని పొలాల్లో వరి నేలకొరిగింది. మామిడి తోటలో కాయలు రాలాయి. కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు చెప్యాల, నల్లగొండ, తిప్పాయిపల్లి, శ్రీరాములపల్లి, రామకిష్టాపూర్, పూడూర్ గ్రామాల్లో ఈదురుగాలల వర్షానికి 90 శాతం వరి పంట నష్టం వాటిల్లింది. పెగడపల్లి మండలం నందగిరిలో బోడపట్ల చారికి చెందిన రెండు బర్రెలు పిడుగుపాటుకు మృతిచెందాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పలు గ్రామాల్లో వరి నేలకొరిగింది. మామిడి తోటల్లోని కాయలు రాలి నేలరాలాయి. అనంతపల్లి, బోయినపల్లిలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఇల్లంతకుంట మండలంలో వడగళ్లు పడ్డాయి.
కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు కప్పడంతో ధాన్యం తడువలేదు. రోడ్లపైన ఆరబోసిన వడ్లు మాత్రం తడిసి పోయాయి. ఎల్లారెడ్డిపేట మండ లం హరిదాస్నగర్లోని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పలు రైతులకు చెందిన వడ్లకుప్పలు తడిసి పోయాయి. సిరిసిల్ల పట్టణంలోని ఫ్లెక్సీలు గాలికి కొట్టుకువచ్చి విద్యుత్ తీగలపై పడ్డాయి. విద్యానగర్, శాంతినగర్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. కాగా, పంట నష్టంపై వెంటనే సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ రంగంలోకి దిగింది. ఫోన్ల ద్వారా నష్టపోయిన పంటల వివరాలను సేకరిస్తున్నారు. మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించేందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.