Ganesh Mandapa organizers | కోరుట్ల, ఆగస్టు 22: గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు సూచించారు. పట్టణంలోని వాసవీ కళ్యాణ భవనంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపం నిర్వాకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ సిస్టమ్ నిలిపి వేయాలని తెలిపారు. డీజే లు నిషిద్ధమని పేర్కొన్నారు.
మండపాల వద్ద పర్యవేక్షణ కోసం కమిటీ సభ్యులు ఎల్లప్పుడు ఉండాలన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద భక్తి భావంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసి కేసుల్లో ఇరుక్కోవద్దని డీఎస్పీ హితవు పలికారు. సమావేశంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రామకృష్ణ, విద్యుత్ డీఈ గంగారం, ఇరిగేషన్ ఏఈ సిరాజ్ , గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.