ముకరంపుర, ఫిబ్రవరి 9 : వ్యవసాయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులకు చేయూతనందించేందుకు కరీంనగర్‌లోని చింతకుంటలో గల వ్యవసాయ పరిశోధనా స్థానం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. అందులో భాగంగా గురువారం ఆధునిక యంత్ర పరికరాలతో క్షేత్ర ప్రదర్శనతో పాటు చిరుధాన్యాల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరై జడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి ఈ సదస్సును ప్రారంభించారు. వందలాది మంది రైతులు తరలిరాగా, అధికారులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. అలాగే సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులు తమ ఆధునిక యంత్ర పరికరాలు, చేతితో నడిపించే పరికరాలు, పురుగు మందులు పిచికారీ చేసే డ్రోన్, బూమ్ స్ప్రేయర్లను ప్రదర్శించి, వాటి వినియోగం, ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ వివరాలను వివరించారు. రైతులు యంత్ర పరికరాలు, చిరుధాన్యాల సాగుపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. డాక్టర్ పీ రాజయ్య వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, డాక్టర్ మధూకర్‌రావు చిరుధాన్యాల సాగు, యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. సమావేశంలో నాబార్డ్ ఏజీఎం అనంత్‌కుమార్, కేవీకే జమ్మికుంట శాస్త్రవేత్త డాక్టర్ కే వెంకటేశ్వర్రావు, డీఏవో శ్రీధర్, శాస్త్రవేత్తలు డాక్టర్ కే మదన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ డీ శ్రీనివాస్, డాక్టర్ జీ ఉషారాణి, డాక్టర్ ఎం రాజేంద్రప్రసాద్, డాక్టర్ ఏ విజయభాస్కర్, రైతులు పాల్గొన్నారు.
యాంత్రీకరణతో పని సులువు
వ్యవసాయంలో దుక్కి దశ నుంచి ధాన్యాన్ని బస్తాల్లో నింపే వరకు యంత్రాలు, పరికరాలను వినియోగించే విధంగా పరిశోధనలు చేస్తున్నాం. ముఖ్యంగా చేతితో కలుపు తీసే యంత్రాలతోపాటు ఇతర పరికరాలను పరిశోధనా స్థానంలోనే రూపొందించి లాభాపేక్ష లేకుండా రైతులకు విక్రయిస్తున్నాం. కొత్త యంత్రాలను రూపొందిస్తున్నాం. ఇతర రాష్ర్టాల్లో అభివృద్ధి చేసిన యంత్రాలను సైతం మన సాగు విధానాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాం. ముఖ్యంగా వరి కొయ్యలను కాల్చకుండా భూమిలోనే దున్ని ఎరువుగా మార్చేలా పరికరాలను వినియోగించాలి. యాంత్రీకరణతో రైతులకు పని సులువు అవుతుంది. సమయం కూడా కలిసివస్తుంది.
– డాక్టర్ పీ రాజయ్య, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రికల్చర్ ఇంజినీరింగ్)
సాంకేతికతతో అధిక దిగుబడి
వ్యవసాయంలో సాంకేతికత వినియోగంతో అధిక దిగుబడి, ఆదాయం పొందవచ్చు. మన దగ్గర వ్యవసాయంలో యంత్రాల వినియోగం, చిరుధాన్యాల సాగు తక్కువగా ఉన్నందున ప్రదర్శన ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. చిరుధాన్యాల వినియోగం, ఉత్పత్తిలో మన దేశం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ జిల్లా స్థాయిలో విస్తీర్ణం పెరగాల్సిన అవసరం ఉన్నది. జొన్నలు, కొర్రలు, రాగులు, వరిగెలు, అరికలు, ఊదలతో అనేక ప్రయోజనాలున్నాయి. మన ప్రాంతంలో జొన్న, రాగులు, సజ్జలు సాగవుతున్నాయి. వీటితో తయారు చేసిన పదార్థాలు మంచి పోషక విలువలు కలిగిన బలవర్ధకమైన ఆహారం. వర్షాభావం, అధిక వర్షపాతాన్ని తట్టుకుని మంచి దిగుబడినిస్తాయి. ఇదీ సీ4రకానికి చెందిన పంట. భూసారాన్ని కాపాడడంతో పాటు పర్యావరణ పరిక్షణకు దోహదం చేస్తాయి. ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు చేయవచ్చు. అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం కావడంతో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు నిర్ణయించాం. ప్రాసెసింగ్, మార్కెటింగ్ వంటి సమస్యలున్నా పరిష్కారం దిశగా కృషి జరుగుతున్నది. నిధుల కేటాయింపు సైతం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాం.
-డాక్టర్ జీ మంజులత, పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ (కరీంనగర్)
‘చిరుధాన్యాల’పై దృష్టి సారించాలి
రైతులు వరితోపాటు చిరుధాన్యల సాగుపై దృష్టి సారించాలి. వరి సాగును కొంత తగ్గించుకుంటూ ఆ మేరకు చిరు ధాన్యాలు సాగు చేసేలా అవగాహన పెంచుకోవాలి. పూర్వం ప్రతి ఇంట్లో చిరుధాన్యాలకు సంబంధించిన ఆహారాన్ని మాత్రమే తినేవారు. ప్రస్తుతం ఆహారం శైలిలో ఆనేక మార్పులు వచ్చాయి. కుటుంబం కోసం కొంత విస్తీర్ణంలో చిరుధాన్యాలు సాగు చేయాలి. అందుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉండేలా చూస్తాం. దళితబంధు కింద కొత్తగా వచ్చే యూనిట్లలో 80 శాతం వ్యవసాయానికి అవసరమైన యంత్రాలు, పరికరాలు అందిస్తాం. హుజూరాబాద్‌లో 600కోట్లతో యంత్రాలు అందిస్తే, అందులో 300 కోట్లతో వ్యవసాయ యంత్రపరికరాలు లబ్ధిదారులకు అందించాం. డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. రైతులు ధరణి సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పరిష్కరిస్తాం.
– కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్
అధిక పోషక విలువలు
చిరు ధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉంటాయి. ప్రస్తుతం వీటి వినియోగం పెరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చిరుధాన్యాలతో అనుకూ లమైన ఉత్పత్తుల తయారీ చేపట్టాలి.
– జడ్పీ సీఈవో ప్రియాంక
చిరుధాన్యాలను పండించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో చిరు ధాన్యాలకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు తనకున్న భూమిలో తన ఇంటి అవసరాలకు సరిపడేలా చిరు ధాన్యాలను పండించుకోవాలి. మన ప్రాంతాల్లో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు మంచి దిగుబడినిస్తాయి. మంచి బలవర్ధకమైన ఆహారం కావడంతో వినియోగించడానికి శ్రద్ధ చూపుతున్నారు. తక్కువ నీటి వినియోగంతో సాగయ్యే పంట కావడంతో మేలైన యాజమాన్యం, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది.
– పీ మధూకర్‌రావు, శాస్త్రవేత్త
ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి
కొంతకాలం నుంచి చిరు ధాన్యాలు పండిస్తున్న. కానీ, వాటిని స్థానికంగా ప్రాసెసింగ్ చేసేలా పరిశ్రమలు అందుబాటులోకి తేవాలి. మార్కెటింగ్ సౌకర్యాలను సైతం మరింత మెరుగు పర్చాలి. అన్ని సౌకర్యాలుంటే రైతులు ఎక్కువ మంది ముందుకు రావడానికి అవకాశముంటుంది. మండల స్థాయిలోనూ చిన్న చిన్న ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసే దిశగా శాస్త్రవేత్తలు కృషి చేయాలి.
– రవీందర్‌రెడ్డి, రైతు, లక్ష్మీపూర్ (మానకొండూర్)
అవగాహన కల్పించాలి
వరి సాగు చేస్తున్న రైతులకు కొంత చిరుధాన్యాలు సాగు చేసేలా అధికారులు అవగాహన కల్పించాలి. రైతులు ముందుకు వచ్చేలా ప్రోత్సాహకాలు అందించాలి. విత్తన లభ్యతతోపాటు పండించిన పంటకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే విషయమై ముందస్తుగా రైతులతో సమావేశాలు నిర్వహించాలి. అప్పుడే సాగులో మార్పు తేవడానికి వీలుంటుంది.
– లస్మయ్య, రైతు, మల్కపూర్ (కొత్తపల్లి)
యంత్రాలతో ఖర్చు తగ్గించుకోవచ్చు
ఆధునిక సాగు యంత్రాలు, పరికరాలను పరిశీలించిన. కొత్తగా బాగున్నయ్. వీటి వినియోగంతో కూలీల ఇబ్బంది లేకుండా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. అయితే ప్రభుత్వం కొంత రాయితీ ఇస్తే బాగుంటుంది. చిరు ధాన్యాల సాగు, వినియోగం, మార్కెటింగ్ అంశాలపై కొంత అవగాహన వచ్చింది.
– రాజు, రైతు, కొండాపూర్ (కొత్తపల్లి)
యంత్రాలతో ప్రయోజనం
ప్రస్తుతం కూలీల సమస్యతో ఖర్చు అధికమవుతుంది. ఈ పరిస్థితుల్లో దుక్కి నుంచి మొదలుకుని ధాన్యం సంచుల్లో నింపేంత వరకు యంత్రాలు, పరికరాలు రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఏడాది పొడవునా చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తాం.
– పరిశోధన మండలి సహ
సంచాలకులు డాక్టర్ జీ శ్రీనివాస్