Jagityal | వేములవాడ, జూన్ 13: వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ రహదారి జగిత్యాల బస్టాండ్ సమీపంలో రాజన్న సన్నిధికి వచ్చిన భక్తుడి కారు రహదారిలో శనివారం ఇరుక్కుపోయింది. రహదారిలో భూగర్భ మురికి కాలువ నిర్మాణ పనులు జరగగా ఇప్పటికే చిన్నపాటి వర్షానికి రహదారి కుంగిపోయిందని స్థానిక కాలనీవాసులు తెలిపారు.
మరోసారి కురిసిన వర్షానికి రహదారి కుంగిపోవడంతో అటుగా వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన భక్తుడి వాహనం ప్రమాదవశాత్తు రహదారిలో ఇరుక్కుపోయిందని తెలిపారు. మరో వాహనం సహాయంతో వాహనాన్ని బయటకు తీసినప్పటికీ కుంగిన రహదారితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక కాలనీవాసులు కోరారు.