సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 22: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో తంగళ్లపల్లి మండలం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించి ఆదర్శంగా నిలిచిందని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పడిగెల మానస అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ, ఏమైనా సమస్యలుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక చొరవతో పరిష్కరించుకుందామని సూచించారు. మండల సమగ్రాభివృద్ధికి సహకరించిన సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులకు ఎంపీపీ పడిగెల మానస జ్ఞాపికలు అందించి సన్మానించారు. అంతకుముందు సమావేశంలో బడ్జెట్, సవరణ బడ్జెట్‌ను ఆమోదించారు. ఇక్కడ ఏఎంసీ చైర్పర్సన్ పూసపల్లి సరస్వతి, పీఏసీఎస్ చైర్మన్లు బండి దేవదాస్‌గౌడ్, కోడూరి భాస్కర్‌గౌడ్, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఎంపీడీవో లచ్చాలు, వైస్‌ఎంపీపీ అంజయ్య, ఎంపీటీసీలు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు చెన్నమనేని వెంకట్రావు, వలకొండ వేణుగోపాలరా వు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.
జడ్పీటీసీని నిలదీసిన ఎంపీటీసీ అంతయ్య
సర్పంచుల బిల్లుల విషయంలో చర్చ జరుగుతుండగా, జడ్పీటీసీ మంజుల మాట్లాడుతూ, కేటీఆర్ సార్ తమను కలిసే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో స్పందిచిన ఎంపీటీసీ కోడి అంతయ్య జడ్పీటీసీ మంజులను నిలదీశారు. జడ్పీటీసీగా రెండుసార్లు అవకాశం ఇచ్చారని, తొమ్మిదిన్నర ఏండ్లు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని, కనీసం కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపకుండా కలువలేదని అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా రామన్నకు క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో జడ్పీటీసీ మంజుల, ఎంపీటీసీ అంతయ్య మధ్య వాగ్వాదం కాగా, ఎంపీపీ మానస, సెస్ చైర్మన్ రామారావు సముదాయించారు. తర్వాత ఎంపీడీవో చాంబర్లో కోడి అంతయ్యతో జడ్పీటీసీ మంజుల భర్త రాంలింగారెడ్డి వాగ్వాదానికి దిగారు. రాజీనామా చేయాలని నువ్వేందుకు అడుగుతున్నావు? నీకేం అవసరం? మీటింగ్‌లో అడుగుతావా? అంటూ కోడి అంతయ్యపై రాంలింగారెడ్డి ఫైర్ అయ్యాడు. కేటీఆర్‌ను అన్నందుకే అన్నానని అంతయ్య బదులు చెప్పాడు. దీంతో వాగ్వాదం పెరిగి, మాటల యుద్ధం జరిగింది. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పడిగెల రాజు, ఏఎంసీ చైర్పర్సన్ సరస్వతి, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కల్పించుకుని ఇద్దరిని సముదాయించారు.