జగిత్యాల, జూలై 19: కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చేస్తున్న తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పని చేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం పార్టీ ధర్మపురి నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ముఖ్య అతిథిగా హాజరై, సోషల్ మీడియా వారియర్స్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదిక కాంగ్రెస్ అబద్ధాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించి, నిజాలను నిలదీయాల్సిన బాధ్యత సోషల్ మీడియా వారియర్స్‌పై ఉందన్నారు. నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర అత్యంత కీలకమైందని, ప్రతి ఒక వారియర్ ఒక డిజిటల్ సైనికుడిలా పనిచేయాలని కోరారు.
జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొప్పుల ఈశ్వర్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను పక్కన పెడుతున్నారని, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తానని చెప్పి 30 నెలల గడిచినా వాటి ఊసే లేదన్నారు. ఎల్‌నినో ప్రభావంతో సాగు, తాగునీటికి ఇబ్బంది పడుతుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం జలాలను ఎత్తిపోసుకునే అవకాశమున్నా కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందోనని పంపులను ప్రారంభించడం లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జగిత్యాల పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, అయ్యోరి రాజేశ్, నియోజకవర్గ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.