Cooking training camp | సుల్తానాబాద్ రూరల్ జూన్ 9: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో వంటకాలను మరింత రుచికరంగా, పరిశుభ్రంగా తయారు చేయడం కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం సోమవారం నిర్వహించినట్లు జీసీడీవో కవిత తెలిపారు. జిల్లాలోని కేజీబీవీ వంట చేసే మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి కవిత హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలంటే శుభ్రతతో పాటు పోషకాహారాన్ని కూడా ప్రాముఖ్యతనివ్వాలి అన్నారు. ఈ శిక్షణలో కొత్త మెనూ వివరంగా తెలియజేశారు. తగిన పరిమాణాలు, తయారీ పద్ధతులు ప్రాక్టికల్‌గా చూపించారు.ఈ శిబిరంలో వంట చేసే మహిళలు స్వయంగా వండడం జరిగింది. గుడ్డు బుజ్జి వడ, బొండా, పకోడీ వంటి స్నాకులు, అలాగే కందగడ్డ, చామగడ్డ కూరలు, గుడ్డు టమోటా వంటి కొత్త రుచుల అందించనున్నారు.
ఈ శిక్షణా శిబిరం ద్వారా వంట మనుషుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. విద్యార్థులకు ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ స్వప్న తో పాటు తదితరులు పాల్గొన్నారు.