పెద్దపల్లి, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): కార్మికులపై సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కాఠిన్యం ప్రదర్శిస్తున్నది. మస్టర్ల పేరుతో సింగరేణిలోని 11ఏరియాల్లో 200మంది కార్మికులను డిస్మిస్ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగంలో గైర్హాజరయ్యే కార్మికులపై ఉన్న
మానవతా దృక్పథానికి స్వస్తిపలికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నది.
ఈ మేరకు యాజమాన్యం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. 100 మస్టర్ల కంటే తక్కువగా ఉన్నాయనే పేరుతో 200మంది కార్మికులపై తాజాగా వేటు వేసి.. మరో నెల, రెండు నెలల్లో మరో 400మందిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. జబ్బు, ప్రమాదం, కుటుంబ సమస్యలు, డ్యూటీ కష్టాలు లాంటివి పరిగణనలోకి తీసుకోకుండా కేవలం హాజరు పేరుతో జీవనోపాధిపై దెబ్బతీసే చర్యలకు దిగింది. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారనే నెపంతో గతేడాది కాలంగా స్వల్ప మస్టర్లు కూడా లేని కార్మికులను తొలగిస్తున్నది.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క కార్మికుడిని కూడా డిస్మిస్ చేయకపోగా.. దాదాపుగా 13వేలకు పైగా కారుణ్య నియామకాలను చేపట్టింది. కానీ, కాంగ్రెస్ సర్కారు రెండున్నరేళ్లలో దాదాపుగా 200మందికి పైగా కార్మికులపై డిస్మిస్ వేటు వేసేందుకు సిద్ధం కాగా.. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఇంత జరుగుతున్నా.. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు మాత్రం పట్టంచుకోవడం లేదనే విమర్శలున్నాయి.
సింగరేణిలో ఏరియాల వారీగా డిస్మిస్ కార్మికుల జాబితా రెడీ అయినట్లు తెలుస్తున్నది. కొత్తగూడెం ఏరియాలో 20మంది, మణుగూరులో ఐదుగురు, భూపాలపల్లిలో 40, బెల్లంపల్లిలో ఇద్దరు, మందమర్రిలో 12, శ్రీరాంపూర్‌లో అత్యధికంగా 55, రామగుండం-1లో 20, రామగుండం-2లో ఎనిమిది, రామగుండం-3లో 16, ఎస్టీపీపీలో ఒకరిని తొలగించేందుకు జాబితా సన్నద్ధమైనట్లు తెలుస్తున్నది.
200మంది డిస్మిస్‌పై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న యాజమాన్యం ఇప్పటికే కార్మికులు, కార్మిక సంఘాలకు లీకు ఇచ్చినట్లు సమాచారం. కార్మికుల స్పందన ఆధారంగా ఇంకా ఎంత మందిపై డిస్మిస్ వేటు వేస్తారనేది వేచి చూడాల్సి ఉన్నది.
గైర్హాజరు పేరిట సింగరేణి యాజమాన్యం కార్మికులపై సానుభూతిని పక్కనపెట్టింది. గతంలో వంద మస్టర్లు కూడా లేనివారి విషయంలో సైతం అనేక విధాలుగా ఆలోచన చేసేది. గత ఐదేండ్ల హిస్టరీ చూసి, విచారణ జరిపేది. చార్జిషీట్ ఇచ్చి చేరకపోతే చివరికి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తదుపరి చర్యలకు ఉపక్రమించేది.
యాజమాన్యం ఇలా కఠినంగా వ్యవహరిస్తే సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. నిజంగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ.. ఆప్సెంటిజం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటే తప్పులేదు. కానీ అనారోగ్య, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆప్సెంటిజం అయిన వారిపై సానుభూతి చూపాలి. 200మంది కార్మికుల డిస్మిస్ నిర్ణయంపై పునరాలోచించాలి. ఈ ప్రభుత్వం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చింది లేదు. కారుణ్య ఉద్యోగాలకు గతిలేదు. కానీ ఉన్న ఉద్యోగాలను తీయడం మాత్రమే వీరికి చేతనవుతుంది.
– మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు టీబీజీకేఎస్ (రామగుండం)