పెద్దపల్లి, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించారు. 1,31,364 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 15,96,430 మంది ఓటర్లకు గాను 10,83,453 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం రామగిరి మండలం సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూహెచ్ కళాశాలలో పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను లెక్కించారు. అదే విధంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కళ్లలోని ఐజా ఇంజినీరింగ్ కాలేజీలో లెక్కించారు. సాయంత్రం వరకు 21 రౌండ్లలో ఫలితం వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 4,75,587 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌కు 3,44,223 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 1,93,356 ఓట్లు వచ్చాయి. వంశీకృష్ణ బీజేపీ అభ్యర్థిపై 1,31,364 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా, ఓట్ల లెక్కింపు తర్వాత సాయంత్రం మంథని జేఎన్టీయూహెచ్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ నుంచి గెలుపు పత్రాన్ని అందుకున్నారు.
అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎప్పుడూ తృతీయ స్థానంలో నిలిచే బీజేపీ ఈసారి అనూహ్యంగా పుంజుకున్నది. దీంతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌కు అత్యధికంగా ఓట్లు 3,44,223 రాగా.. ద్వితీయ స్థానంలో నిలిచారు. లోక్‌సభ పరిధిలో గతంలో ఎప్పుడూ కూడా బీజేపీకి ప్రజల నుంచి పెద్దగా ఆదరణ కనిపించిన దాఖలాలు లేవు. కానీ, ఈ సారి దేశవ్యాప్తంగా అనుకూలమైన వాతావరణం ఉండడంతో పెద్దపల్లి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి కనిపించింది. బీజేపీ అభ్యర్థి ప్రచారంలో కొంత వెనుకపడ్డప్పటికీ పార్టీకి మాత్రం అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డింది. పార్లమెంట్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి కావడంతో బీఆర్ఎస్ వెనుకపడింది. ఇదే విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పదే పదే ప్రచారంలో ప్రస్తావించడంతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానంలో నిలువాల్సి వచ్చింది.
నిర్విరామంగా శ్రమిస్తా
పెద్దపల్లి ఎంపీగా నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఈ విజయం పూర్తిగా ప్రజలది. నా గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఓటుతో నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మా తాత కాక వెంకటస్వామి, తండ్రి వివేక్‌ను గుర్తు పెట్టుకొని నన్ను దీవించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమిస్తా. కష్ట పడుతా. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలందరి సహాయ, సహకారాలతో ఈ విజయం లభించింది. ఈ బాధ్యతను భుజాన ఎత్తుకొని గతంలో పని చేసిన ఎంపీలకు భిన్నంగా అభివృద్ధి చేస్తా. పోరాడి నిధులు తీసుకు వస్తా.
– పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన గడ్డం వంశీకృష్ణ ప్రజాతీర్పును గౌరవిస్తాం